-
బస్టాండ్ ఆవరణలో 54 అడుగుల భారీ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన -
కన్నుల పండువగా నిర్వహించిన మహోత్సవం
-
హాజరైన మాజీ గవర్నర్ దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, లక్ష్మారెడ్డి
కుషాయిగూడ, మే 02: కుషాయిగూడ ప్రాంతం శుక్రవారం జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మారుమోగింది. కుషాయిగూడ బస్టాండ్ ఆవరణలో నూతనంగా నిర్మించిన 54 అడుగుల భారీ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక ఉత్సాహం మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు, భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు.
ప్రముఖుల హాజరు – ప్రత్యేక పూజలు
విగ్రహ ప్రతిష్టాపన వేడుకలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విగ్రహానికి శాస్త్రోక్తంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాల్లో వారు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు భారీగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
రాజకీయ శ్రేణుల సందడి
ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, భేతి సుభాష్ రెడ్డి తమ అనుచరులతో కలిసి పాల్గొన్నారు. అలాగే మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పజ్జూరి పావని మణిపాల్ రెడ్డి, బొంతు శ్రీదేవి తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
54 అడుగుల ఎత్తులో కొలువుదీరిన ఈ భారీ ఆంజనేయ స్వామి విగ్రహం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకను చూడటానికి చుట్టుపక్కల కాలనీల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో కుషాయిగూడ ప్రాంతమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.




