-
ముగియని బైపాస్ రోడ్డు పనులు.. గుంతలు, రాళ్లతో కాలనీవాసుల అవస్థలు
-
డ్రైనేజీలు నిలిచి దోమల వ్యాప్తి.. అనారోగ్యం పాలవుతున్న జనం
-
సమస్య పరిష్కరించకుంటే ధర్నా తప్పదు: బీజేపీ మండల అధ్యక్షుడు జీర్రా మహిపాల్
ధర్పల్లి, మే 02: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని భగత్ సింగ్ కాలనీ (13వ వార్డు) ప్రజలు రోడ్డు సమస్యతో నరకయాతన అనుభవిస్తున్నారు. గ్రామంలోని ప్రధాన రహదారి అయిన బైపాస్ రోడ్డు మరమ్మత్తు పనులు గత రెండేళ్లుగా సాగుతూనే ఉండటం, ఇప్పటికీ పూర్తి కాకపోవడంపై కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మండల బీజేపీ అధ్యక్షుడు జీర్రా మహిపాల్ పార్టీ కార్యకర్తలతో కలిసి కాలనీని సందర్శించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అధికారుల నిర్లక్ష్యం – ప్రజల ఆవేదన
ఈ సందర్భంగా కాలనీవాసులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. బైపాస్ రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద రాళ్లు పడి ఉండటంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీలు ఎక్కడికక్కడ నిలిచిపోయి, మురుగు నీరు నిల్వ ఉండటంతో దోమలు విజృంభించి తామంతా అనారోగ్యం పాలవుతున్నామని వాపోయారు. “ఎన్నికల సమయంలోనే నాయకులకు కాలనీ గుర్తుకొస్తుంది, ఓట్లు వేయించుకున్నాక సమస్యలు పట్టించుకోవడం లేదు” అని నిరసన వ్యక్తం చేశారు.
వివక్ష చూపుతున్నారా?: జీర్రా మహిపాల్
అనంతరం జీర్రా మహిపాల్ మీడియాతో మాట్లాడుతూ.. భగత్ సింగ్ కాలనీలో ఇన్ని సమస్యలు ఉన్నా సర్పంచ్, ఎమ్మెల్యేలకు కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇది గోసంగి కాలనీ అని చులకనగా చూస్తున్నారా? అని నిలదీశారు. తక్షణమే నిధులు కేటాయించి రోడ్డు, డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాలనీవాసులందరినీ ఐక్యం చేసి రోడ్డుపైనే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.
పాల్గొన్న వారు: ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు టేడ్డు శంకర్, బీజేవైఎం మండల అధ్యక్షుడు దోర్నాల రాజశేఖర్, నాయకులు జ్ఞానేశ్వర్, చంద్రమౌళి, వినోద్, కుమార్, గోనె రాజేశ్వర్, రాజశేఖర్ మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.




