-
అరకొర నిల్వలతో వాహనదారుల అవస్థలు
-
గంటల తరబడి నిరీక్షణ.. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్
చంపాపేట్, ఏప్రిల్ 28 
: నగరంలోని ఐఎస్ సదన్, చంపాపేట్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. మంగళవారం ఉదయం నుంచే స్థానిక పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. ఇంధన నిల్వలు అరకొరగా ఉండటంతో పలు బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమివ్వడం వాహనదారులను మరింత ఆందోళనకు గురిచేసింది.
గంటల తరబడి నిరీక్షణ
పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తాయి. గంటల తరబడి ఎండలో వేచి ఉన్నా ఇంధనం దొరకని పరిస్థితి నెలకొందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బంకుల్లో పరిమితంగానే పోస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఆవేదన
ఇంధన కొరత ప్రభావం ముఖ్యంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లపై తీవ్రంగా పడింది. రోజువారీ ఆదాయంపై ఆధారపడే తాము, గంటల తరబడి బంకుల వద్దే ఉండిపోవడంతో ఉపాధి కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “పెట్రోల్ కోసం సగం రోజు గడిచిపోతోంది, ఇక సవారీలు ఎప్పుడు చేయాలి? కుటుంబ పోషణ భారంగా మారుతోంది” అని పలువురు డ్రైవర్లు వాపోయారు.
ప్రభుత్వం స్పందించాలి
ఈ పరిస్థితిపై వాహనదారులు మండిపడుతున్నారు. ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుతున్నారు. ఇంధన సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు నిరంతర పర్యవేక్షణ ఉండాలని వారు విజ్ఞప్తి చేశారు.




