-
డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి
-
అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా తీరని హామీలు
-
కార్మికులు అధైర్యపడొద్దు.. బీజేపీ అండగా ఉంటుంది
నిర్మల్, ఏప్రిల్ 24
: రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి, నిర్లక్ష్యపూరిత విధానాల వల్లే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు రితేష్ రాథోడ్ తీవ్రంగా విమర్శించారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసి, చికిత్స పొందుతూ మృతి చెందడంపై ఆయన గీత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
హామీలు అమలు చేయడంలో విఫలం
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగులకు అలవికాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా వాటిని అమలు చేయలేదని మండిపడ్డారు. కనీసం కార్మికుల సమస్యలను వినే తీరిక కూడా ప్రభుత్వానికి లేకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ దౌర్జన్య వైఖరికి నిరసనగా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగినా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే మనస్తాపం చెందిన శంకర్ గౌడ్ ప్రాణాలు తీసుకున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ తీరు ఒక్కటే..
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆర్టీసీ సమస్యలను గాలికొదిలేసి కార్మికుల ప్రాణాలు తీసిందని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని రితేష్ రాథోడ్ ధ్వజమెత్తారు. శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, తక్షణమే ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
ఇప్పటికైనా ప్రభుత్వం మొండిపట్టు వీడి, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎవరూ మనోధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యల వంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. బీజేపీ పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలబడి పోరాడుతుందని రితేష్ రాథోడ్ స్పష్టం చేశారు.




