-
అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డులో మొక్కజొన్న రైతుల అగచాట్లు
-
తరుగు పేరుతో దోపిడీని అరికట్టాలని డిమాండ్
-
బోరు పాడై తాగునీరు లేక రైతులు, హమాలీల అవస్థలు
అలంపూర్ చౌరస్తా, ఏప్రిల్ 23
: రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు కనీసం గన్నీ బ్యాగులు కూడా సరఫరా చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉందని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు, జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ధ్వజమెత్తారు. గురువారం అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి, రైతులతో మాట్లాడారు.
20 రోజులుగా నిరీక్షణ.. ఏడు రోజులుగా నత్తనడక
ఈ సందర్భంగా కురువ పల్లయ్య మాట్లాడుతూ.. మార్కెట్ యార్డుకు మొక్కజొన్నలు తెచ్చి రైతులు 20 రోజులు గడుస్తున్నా, కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోందని విమర్శించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభమై ఏడు రోజులు గడుస్తున్నా.. సర్వర్ సమస్యలు, కంప్యూటర్ల మొరాయింపుతో రైతులు రాత్రింబవళ్లు పంట వద్దే కాపలా ఉండాల్సి రావడం దుర్మార్గమన్నారు.
గన్నీ బ్యాగుల కొరత – రైతులకు రూ. 10 నష్టం
గన్నీ బ్యాగుల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. మార్క్ఫెడ్ వద్ద గన్నీ బ్యాగులు లేవని, రైతులనే బయట కొనుగోలు చేయమనడం ఏంటని ప్రశ్నించారు. “మార్కెట్లో రైతు రూ. 25కు గన్నీ బ్యాగు కొంటే, ప్రభుత్వం కేవలం రూ. 15 మాత్రమే ఇస్తామంటోంది. అంటే ప్రతి సంచిపై రైతు రూ. 10 నష్టపోవాల్సి వస్తోంది. వెంటనే లక్ష గన్నీ బ్యాగులను అందుబాటులోకి తీసుకురావాలి” అని డిమాండ్ చేశారు.
యార్డులో కనీస సౌకర్యాలు శూన్యం
మార్కెట్ యార్డులో కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బోరు మోటారు చెడిపోయిందని, రైతులు, హమాలీలు దాహంతో అల్లాడుతున్నారని తెలిపారు. తక్షణమే బోరు మరమ్మతులు చేయించి, అప్పటివరకు ఫిల్టర్ వాటర్ సౌకర్యం కల్పించాలని కోరారు. తూకం వేసే కాంటాలు కేవలం నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయని, మరో పది మరమ్మతులో ఉన్నాయని.. అదనపు వేయింగ్ మిషన్లు తెప్పించాలని సూచించారు.
తరుగు పేరుతో అదనపు దోపిడీ
50 కేజీల బస్తాకు అదనంగా కేజీ 900 గ్రాముల మొక్కజొన్నలను తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని పల్లయ్య ఆరోపించారు. హమాలీ ఖర్చులు కూడా రైతులే భరించాల్సి రావడం శోచనీయమన్నారు. అక్కడి నుండే ఆయన జిల్లా మార్క్ఫెడ్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను వివరించారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పాల్గొన్న రైతులు: ఈ నిరసన కార్యక్రమంలో మొల్కసీమ రంగస్వామి, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, సూరి, జైపాల్ రెడ్డి, జానకిరాముడు, శివరాం రెడ్డి, రామన్న, లక్ష్మిదేవి, నాగేశ్వర్ రెడ్డి, మద్దిలేటి, కోటీశ్వర్ రెడ్డి, హనుమంత్, రాజు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.




