-
ప్రాజెక్టు వ్యయంపై అబద్ధాలు చెబుతున్న ప్రభుత్వం
-
రెండు పిల్లర్లు కుంగితే లక్ష కోట్ల అవినీతి అనడం హాస్యాస్పదం
-
బీఆర్ఎస్ అగ్రనేతలపై కక్షపూరిత ఆరోపణలు చేస్తున్నారు
ఏఎస్ రావు నగర్, ఏప్రిల్ 23
: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అసత్య ఆరోపణలు చేస్తోందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. గురువారం ఏఎస్ రావు నగర్లోని తన క్యాంపు కార్యాలయంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఖర్చుపై తప్పుడు లెక్కలు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు. “ప్రాజెక్టు వాస్తవ వ్యయం 34 వేల కోట్లు అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష కోట్లు అంటూ పచ్చి అబద్ధాలు చెబుతోంది. కేవలం రెండు పిల్లర్లు కుంగిపోయిన చిన్న సాంకేతిక సమస్యను భూతద్దంలో చూపిస్తూ రాజకీయం చేస్తున్నారు. ఆ రెండు పిల్లర్లను సుమారు 400 కోట్ల రూపాయలతో బాగు చేసే అవకాశం ఉన్నప్పటికీ, పనిగట్టుకుని బురదజల్లుతున్నారు” అని దుయ్యబట్టారు.
రాజకీయ కక్షసాధింపు
తమ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు హరీష్ రావులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తున్నారని, అయితే ప్రజలకు నిజానిజాలు తెలుసని పేర్కొన్నారు. తమకు న్యాయస్థానాల మీద పూర్తి నమ్మకం ఉందని, విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడమే లక్ష్యం
ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాళేశ్వరాన్ని సాకుగా చూపుతోందని ఎమ్మెల్యే విమర్శించారు. అభివృద్ధి పనులను పక్కనపెట్టి కేవలం ప్రతిపక్ష నేతలపై ఆరోపణలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలువురు మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.




