
జగిత్యాల ( నేషనలిస్ట్ వాయిస్) ఏప్రిల్ 12 : ప్రభుత్వ సర్వేలు, జనాభా లెక్కల పేరుతో ఇళ్లలోకి వచ్చే అపరిచితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ హెచ్చరించారు. ఇటీవల బోధన్ పట్టణంలో అధికారులుగా నటిస్తూ కొందరు దుండగులు చోరీలకు పాల్పడిన నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి అధికారిక సర్వేలు నిర్వహించడం లేదని, గుర్తింపు కార్డులు లేకుండా వచ్చే ఎవరినీ ఇళ్లలోకి అనుమతించవద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఒంటరిగా ఉండే వృద్ధులు, మహిళలు ఈ మోసగాళ్ల బారిన పడకుండా కుటుంబ సభ్యులు అవగాహన కల్పించాలని కోరారు. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ప్రజల భద్రతకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు.




