సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం గ్రామంలో ప్రసిద్ధ శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు వినాయక చవితి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ ఈవో లావణ్య తెలిపిన వివరాల ప్రకారం, ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, వివిధ హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ప్రతిరోజూ ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 25న మహాగణపతి దుర్వా హవనం అనంతరం స్వామివారి లడ్డూ వేలం, జాతరను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

