-
ఒకేరోజు నియోజకవర్గవ్యాప్తంగా విస్తృత పర్యటన.. ముమ్మరంగా శంకుస్థాపనలు
-
ప్రతి మున్సిపాలిటీకి రూ. 15 కోట్ల భారీ నిధుల విడుదల
-
జూన్ 2 నుండి కొత్త పింఛన్లు, అర్హులందరికీ రేషన్ కార్డుల పంపిణీ: మంత్రి హామీ
-
కాంగ్రెస్ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో జనసందోహం.. ఘన స్వాగతం
పటాన్చెరు, మే 20
:
“పటాన్చెరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ఇక్కడి ప్రతి మున్సిపాలిటీకి రూ. 15 కోట్ల చొప్పున భారీ నిధులు మంజూరు చేశాం. గత పదేళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురైన పటాన్చెరును ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడతాం” అని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.
బుధవారం పటాన్చెరు నియోజకవర్గంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు వేలాదిగా తరలివచ్చి మంత్రికి గజమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఒకేరోజు సుమారు రూ. 84 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టనున్న పలు మౌలిక వసతులు, విద్యా రంగ అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
మున్సిపాలిటీలకు నిధుల వరద.. రహదారుల విస్తరణ
పర్యటనలో భాగంగా ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున కేటాయించిన పలు ప్రగతి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే భానూర్‌లో రూ. 8.30 కోట్ల వ్యయంతో విశాఖ పీడబ్ల్యూడీ రోడ్డు నుండి శంకరపల్లి–పటాన్చెరు రోడ్డు వరకు కంచర్లగూడెం మీదుగా నిర్మించనున్న సరికొత్త బీటీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. పటాన్చెరు నుండి శంకర్పల్లి వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు 100 ఫీట్ల రహదారి నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
విద్యా రంగానికి పెద్దపీట.. ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం
పేద విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించేందుకు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌నగర్ కేజీబీవీ (KGBV) లో రూ. 60.94 లక్షలు, జిన్నారం కేజీబీవీలో రూ. 70.95 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం సోలక్పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలు చేయించి, ఇండ్లను ప్రారంభించారు.
ఇందిరమ్మ గుర్తొచ్చేలా ప్రగతి.. జూన్ 2 నుండి పింఛన్లు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. 1985లో స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించేందుకు బీడీఎల్ (BDL), ఓడీఎఫ్ (ODF) వంటి ప్రతిష్టాత్మక రక్షణ రంగ పరిశ్రమలను తీసుకువచ్చారని గుర్తుచేశారు. అందుకే ఈ ప్రాంతంలో ఇందిరమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సముచితమన్నారు. భానూర్ కార్మికుల హౌసింగ్ సొసైటీకి త్వరలోనే స్థల కేటాయింపు జరుపుతామన్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని, రాబోయే జూన్ 2వ తేదీ నుండి కొత్త పింఛన్ల పంపిణీ ముమ్మరంగా ప్రారంభిస్తామని ప్రకటించారు.
ఇది చారిత్రాత్మక రోజు: కాట శ్రీనివాస్ గౌడ్
పటాన్చెరు కాంగ్రెస్ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పటాన్చెరు నియోజకవర్గ విద్యా, మౌలిక వసతుల రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఒకేరోజు రూ.84 కోట్లకు పైగా నిధుల పనులకు శ్రీకారం చుట్టడం నియోజకవర్గ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘట్టమని హర్షం వ్యక్తం చేశారు.
పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ భారీ ప్రగతి పర్యటనలో టీజీఐఐసి (TGIIC) చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, పార్టీలకు అతీతంగా స్థానిక మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

