-
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ఇతర ప్రాంతానికి మార్చాలి
-
రహదారి, రవాణా సౌకర్యాలు లేని నర్సింగపూర్ స్థలం విద్యాసంస్థకు అనర్హం
-
ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోయే ప్రమాదం
జగిత్యాల, మే 20
:
“జగిత్యాల జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం (KV) స్థాపన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. చెల్గల్ గ్రామంలో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ కోసం ప్రతిపాదించిన 10 ఎకరాల భూమిని వెంటనే కేంద్రీయ విద్యాలయానికి కేటాయించాలి” అని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ఒక అధికారిక లేఖ రాశారు.
నిబంధనల ఉల్లంఘన.. 2 ఎకరాలు ఇస్తే సరిపోతుందా?
ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. కేంద్రీయ విద్యాలయాల సంస్థ (KVS) నిబంధనల ప్రకారం నూతన పాఠశాల భవన నిర్మాణానికి కనీసం 5 ఎకరాల విస్తీర్ణంలో భూమి అవసరమని స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 2 ఎకరాల భూమిని మాత్రమే ఆమోదించడం దురదృష్టకరమని, ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధనలను ఎగతాళి చేయడమేనని విమర్శించారు. చెల్గల్ పరిధిలోని వాలంటరీ స్థలానికి చెందిన 10 ఎకరాల విలువైన భూమిని యంగ్ ఇండియా స్కూల్‌కు కేటాయించిన ప్రభుత్వం.. ప్రతిష్టాత్మక కేంద్రీయ విద్యాలయానికి మాత్రం భూమి ఇవ్వకపోవడం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని మండిపడ్డారు. యంగ్ ఇండియా స్కూల్స్ కోసం జిల్లాలో ఎక్కడైనా ఇతర ప్రత్యామ్నాయ స్థలాన్ని చూసుకోవచ్చని ఆయన సూచించారు.
నర్సింగపూర్ స్థలం పూర్తిగా అనర్హం
ప్రభుత్వం ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయం కోసం నర్సింగపూర్ సమీపంలో ప్రతిపాదిస్తున్న స్థలంపై ఎంపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతానికి సరైన రహదారి సౌకర్యం గానీ, రవాణా వసతులు గానీ లేవన్నారు. పైగా అది పట్టణ మున్సిపల్ డంపింగ్ యార్డ్ (చెత్త నిల్వ కేంద్రం) కు అత్యంత సమీపంలో ఉండటం వల్ల విద్యార్థుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పని, విద్యాసంస్థల ఏర్పాటుకు ఆ స్థలం పూర్తిగా అనర్హమని లేఖలో పేర్కొన్నారు.
విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడాలి
చెల్గల్ లోని 10 ఎకరాల అనుకూలమైన భూమిని కేంద్రీయ విద్యాలయ పేరిట తక్షణమే బదలాయింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ప్రభుత్వం భూ కేటాయింపుల్లో కాలయాపన చేస్తే, నిబంధనల ప్రకారం జగిత్యాల జిల్లా విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ హెచ్చరించారు.

