-
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు,



కమిషనర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు -
ఉప్పల్‌లోని మరో 4 చెరువులకు కలిపి మొత్తం రూ. 150 కోట్లు మంజూరు
-
కాప్రా డివిజన్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కృతజ్ఞత సభ, సంబరాలు
కాప్రా, మే 19:
కాప్రా చెరువు సమగ్ర సుందరీకరణ మరియు పునరుద్ధరణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా (HYDRAA) సంస్థ రూ. 35 కోట్ల నిధులను మంజూరు చేయడం పట్ల ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు, హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌కు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ నిధుల విడుదలను పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గ కాప్రా డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాప్రా చెరువు వద్ద భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు భైరి నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ భారీ కృతజ్ఞత సభకు నియోజకవర్గంలోని పలు కాలనీల వాసులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు.
ప్రతిపక్షంలో ఉన్నా అభివృద్ధికి సహకారం..
ఈ సభలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఉప్పల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జలాశయాల పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. కాప్రా చెరువుతో పాటు నియోజకవర్గ పరిధిలోని మరో నాలుగు ప్రధాన చెరువుల ఆధునీకరణకు గానూ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ. 150 కోట్ల భారీ నిధులను మంజూరు చేసిందని సంతోషం వ్యక్తం చేశారు.
తాను ప్రతిపక్ష (బీఆర్ఎస్) పార్టీలో ఉన్నప్పటికీ, నియోజకవర్గ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికార పక్ష ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ ఎంతో సహకరిస్తున్నారని, అందుకే ఉప్పల్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నామని స్పష్టం చేశారు. కొందరు రాజకీయ నాయకులు ద్వేషంతో ఈ కృతజ్ఞత సభ జరగకుండా అడ్డుకునేందుకు కుట్రలు పన్నారని, అయితే మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో ఈ సభను ఇంతటి ఘన విజయవంతం చేశామని వెల్లడించారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లో అవినీతిపై మండిపాటు
ఇదే వేదికపై నుంచి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కొందరు స్థానిక నాయకులు నిరుపేదలకు అందే సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను ఇప్పించేందుకు గానూ.. సదరు పేద ప్రజల వద్ద నుంచి రూ. 10,000 వసూలు చేసి చెక్కులు అందజేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. పేదల రక్తం తాగే ఇలాంటి చౌకబారు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. రాజకీయ పట్టింపులు పక్కనబెట్టి, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరైనా తనతో కలిసి రావాలని ఈ సందర్భంగా హితబోధ చేశారు.
భారీగా తరలివచ్చిన జనసందోహం
ఈ కృతజ్ఞత సభకు సుమారు రెండు వేల మందికి పైగా కార్యకర్తలు, కాలనీల ప్రతినిధులు తరలిరావడంతో కాప్రా చెరువు పరిసరాలు గులాబీ మయంగా మారాయి. సభకు విచ్చేసిన వారందరికీ నిర్వాహకులు అల్పాహార వసతి కల్పించారు.
ఈ విజయవంతమైన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్చార్జ్ రావుల శ్రీధర్ రెడ్డితో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, మహిళా ప్రతినిధులు మరియు వేలాది మంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

