-
సర్కారు బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్య: సర్పంచ్ ఆశవ్వ, హెచ్ఎం వెంకటరమయ్య
-
విద్యా వారోత్సవాల సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన
ధర్పల్లి, మే 16
:
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ధర్పల్లి మండలం హోన్నాజిపేట్ గ్రామంలో ‘బడిబాట’ (ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట) కార్యక్రమాన్ని శనివారం ఉత్సాహంగా నిర్వహించారు. విద్యా వారోత్సవాల ముగింపు సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి గ్రామంలో ఇంటింటికీ తిరిగి పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులపై ప్రత్యేక అవగాహన కల్పించారు.
కార్పొరేట్ స్థాయి వసతులు.. ఉచిత విద్య
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మద్దికుంట ఆశవ్వ బాబన్న, పాఠశాల ప్రధానోపాధ్యాయులు (HM) వెంకటరమయ్య సంయుక్తంగా మాట్లాడుతూ.. నేడు ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్నాయని తెలిపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యాబోధనతో పాటు, విద్యార్థుల శారీరక, మానసిక వికాసం కోసం క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను సైతం విరివిగా నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి..
ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, సన్నబియ్యంతో కూడిన రుచికరమైన మధ్యాహ్న భోజన వసతిని వివరించిన వారు.. ప్రైవేట్ పాఠశాలలకు వేలాది రూపాయల ఫీజులు కట్టి ఆర్థికంగా నష్టపోవద్దని తల్లిదండ్రులకు సూచించారు. గ్రామంలోని ఐదేళ్లు నిండిన పిల్లలందరినీ ప్రభుత్వ బడిలోనే చేర్పించి, ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ సురేందర్ రెడ్డి, వార్డు సభ్యులు రాఘవేందర్, అనిల్, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ (VDC) చైర్మన్, సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, అంగన్వాడీ కార్యకర్తలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

