-
పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కేంద్రమంత్రి
-
హైటెక్ సిటీలో పనులు పూర్తవుతుంటే.. మలక్‌పేటలో నత్తనడకన సాగడంపై అసహనం
-
నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థ, ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశం
మలక్‌పేట, మే 16 

: నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా మలక్‌పేట రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తి చేయకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, రైల్వే ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులపై కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం మలక్‌పేట రైల్వే స్టేషన్లో జరుగుతున్న అమృత్ భారత్ స్టేషన్ ఆధునీకరణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి, స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పనుల పురోగతికి సంబంధించిన నివేదికను (ప్రాజెక్ట్ రిపోర్ట్), ప్లాన్ మ్యాప్‌లను రైల్వే ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు.
నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకే విడతలో చేపట్టిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయని, కానీ మలక్‌పేటలో పనులు ఇంకా నత్తనడకన సాగడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులను సకాలంలో విడుదల చేస్తున్నప్పటికీ, పనుల నిర్వహణలో వేగం లోపించడంపై అధికారులను నిలదీశారు. నిర్మాణ పనుల్లో మరియు నాణ్యతలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని స్పష్టం చేశారు.
ప్రయాణికులకు ఇబ్బందులు కలగకూడదు
రోజువారీగా వేలాది మంది ప్రయాణించే ఈ స్టేషన్లో పనులు ఆలస్యం కావడం వల్ల సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. రోజువారీ ప్రణాళికను సిద్ధం చేసుకుని, కార్మికుల సంఖ్యను పెంచి, నిర్ణీత గడువు లోగా ఆధునిక హంగులతో స్టేషన్ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థను ఆదేశించారు. ఇందులో సమన్వయ లోపం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైల్వే ఇంజనీరింగ్ అధికారులదేనని స్పష్టం చేశారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో కేంద్రమంత్రితో పాటు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు, డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM), ప్రాజెక్ట్ ఇంజనీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.

