-
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి
-
ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డున పడ్డాయి: జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్
-
తగ్గించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిక
బెల్లంపల్లి, మే 15
: కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని ఎంసీపీఐ (యు) మంచిర్యాల జిల్లా కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బెల్లంపల్లిలోని పార్టీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడారు.
ఎన్నికల ముందు మాటలు.. ఇప్పుడు ధరల వాతలు
దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్, డీజిల్పై ఒక్కసారిగా మూడు రూపాయల ధర పెంచడం సిగ్గుచేటని నాయకులు విమర్శించారు. ఎన్నికలకు ముందు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు దినదినానికి ఇంధన రేట్లు పెంచుతూ ప్రజలను వంచిస్తోందని మండిపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ధరలు తగ్గించాల్సింది పోయి, ప్రజలపై భారం మోపడం సమంజసం కాదన్నారు.
ఆటో డ్రైవర్ల పరిస్థితి ‘మూలిగే నక్కపై తాటిపండు’
రాష్ట్ర ప్రభుత్వ ఉచిత బస్సు ప్రయాణ నిర్ణయంతో ఇప్పటికే రెక్కాడితే గానీ డొక్కాడని ఆటో డ్రైవర్ల బతుకులు దుర్భరంగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తోడుగా కేంద్ర ప్రభుత్వం లీటర్ డీజిల్పై రూ. 3 పెంచడంతో ఆటో కార్మికుల పరిస్థితి ‘మూలిగే నక్కపై తాటిపండు’ చందంగా తయారైందన్నారు. ఇటు వంటి పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లు, ఓనర్లు చావాలో బతకాలో తెలియక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.
దిగిరాకుంటే ఉద్యమం తప్పదు
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని ఎంసీపీఐ (యు) మంచిర్యాల జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సామాన్యులపై భారాన్ని తగ్గించని యెడల, ప్రజలను మరియు ఆటో కార్మికులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, రోడ్ల దిగ్బంధాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తోగరి రాహుల్, శేఖర్, ఆకాశ్ మరియు అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

