-
చౌరస్తాలో భారీ నిరసన ప్రదర్శన.. స్తంభించిన ట్రాఫిక్
-
సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం
-
ధరలు తగ్గించే వరకు పోరాటం ఆపబోం: దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, మే 15
: అడ్డూఅదుపు లేకుండా డీజిల్, పెట్రోల్ ధరలను పెంచుతూ సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఆందోళన వ్యక్తమైంది. ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్బీనగర్ ప్రధాన చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తరలివచ్చిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
సామాన్యుల జీవితాలతో చెలగాటం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిత్యం ఇంధన ధరలను పెంచుతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రభావం నిత్యావసర వస్తువులపై పడి, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల జీవనం పూర్తిగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నా.. ఇక్కడ మాత్రం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ధరలు పెంచడం దుర్మార్గమన్నారు.
పోరాటాలు మరింత ఉధృతం చేస్తాం
కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకునేందుకు ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇప్పటికైనా పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ప్రజల తరఫున ఆందోళనలు, ధర్నాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కదం తొక్కిన గులాబీ శ్రేణులు
ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, పార్టీ సీనియర్ నాయకులు, పలు డివిజన్ల అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాళ్లు పాల్గొని కదం తొక్కారు. అలాగే ఉద్యమకారులు, యువజన, మహిళా విభాగాల అనుబంధ కమిటీల సభ్యులు, కార్యకర్తలు మరియు పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి నిరసనను విజయవంతం చేశారు.

