-
మా భూమిపై అసత్య ప్రచారాలు చేస్తే సహించం
-
ఎమ్మెల్యేపై ఆరోపణలు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం
-
మీడియా ప్రతినిధిపై చట్టపరమైన చర్యలకు డిమాండ్
అమీన్పూర్, మే 14
: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 576, 577లకు సంబంధించిన భూ వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. తమ భూమిపై కొన్ని వర్గాలు నకిలీ పత్రాలతో అసత్య ప్రచారాలు చేస్తున్నాయని గొట్టిముక్కల సత్యనారాయణ రాజు మండిపడ్డారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన భూమికి సంబంధించిన పత్రాలను విడుదల చేసి, వాస్తవాలను వివరించారు.
వివాదం నేపథ్యం ఇదీ..
సత్యనారాయణ రాజు కథనం ప్రకారం.. సర్వే నంబర్ 576లో 11 గుంటలు, సర్వే నంబర్ 577లో 1 ఎకరం 29 గుంటల భూమికి మొదట పట్టాదారులుగా బ్యాగరి జీతయ్య, పోచయ్య, శంకరయ్యలు ఉండేవారు. 1983లో వారు రామస్వామి సోదరులకు విక్రయించగా, వారి వద్ద నుండి తాము చట్టబద్ధంగా కొనుగోలు చేశామని తెలిపారు. అయితే, మధ్యలో ఆర్డీఓ కార్యాలయంలో సాఫ్ట్ నీలం సత్యనారాయణ పేరిట నకిలీ ORC (Occupancy Rights Certificate) సృష్టించి, జి.పి.ఆర్ హౌసింగ్, అనంతరం జన్మభూమి హౌసింగ్ ఎస్టేట్‌కు విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి.
న్యాయస్థానంలో విజయం మాదే
ఈ ఫోర్జరీ వ్యవహారంపై తాము న్యాయపోరాటం చేయగా, 2013లో ఆ నకిలీ ORC రద్దు అయిందని సత్యనారాయణ రాజు స్పష్టం చేశారు. ప్రస్తుతం అన్ని రెవెన్యూ రికార్డులు తమ పేరిటనే ఉన్నాయని, గతంలోనే గ్రామ పంచాయతీ నుండి ప్రహరీ గోడ నిర్మాణానికి అనుమతులు కూడా పొందామని వివరించారు. 2015లో కొందరు రాజకీయ నాయకులు తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించగా ‘ట్రెస్పాస్’ కేసులు కూడా నమోదు చేశామని గుర్తు చేశారు.
ఎమ్మెల్యేను లాగడం సరికాదు
ఇటీవల ఒక మీడియా ఛానల్ ప్రతినిధి ఎలాంటి ఆధారాలు లేకుండా స్థానిక ఎమ్మెల్యేను, పోలీసులను మరియు తమ అడ్వకేట్‌ను ఈ వివాదంలోకి లాగడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నేను ఇప్పటివరకు ఎమ్మెల్యేను ముఖాముఖిగా కలిసింది కూడా లేదు. ఎమ్మెల్యేకు ఈ భూమితో సంబంధం ఉందని ఎవరైనా నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం” అని సవాల్ విసిరారు.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారిపై మరియు తమపై నిరాధార ఆరోపణలు చేస్తూ, అసభ్య పదజాలం ఉపయోగించిన సదరు మీడియా ప్రతినిధిపై కఠిన చర్యలు తీసుకోవాలని సత్యనారాయణ రాజు వర్గీయులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు బాధితులు, నాయకులు పాల్గొన్నారు.

