-
30 ఏళ్ల నిరీక్షణకు తెర.. కొత్త పైప్లైన్ పనులకు శ్రీకారం
-
మంత్రి శ్రీధర్ బాబు, మధు యాస్కీ గౌడ్ సహకారంతో నిధుల మంజూరు
-
అభివృద్ధి కోసం ప్రహరీ గోడల త్యాగానికి ముందుకొచ్చిన కాలనీవాసులు
వనస్థలిపురం, మే 13
: ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్ పరిధిలోని నాగార్జున కాలనీలో దశాబ్దాలుగా వేధిస్తున్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాస్కీ గౌడ్ ప్రత్యేక చొరవతో మంజూరైన కొత్త డ్రైనేజీ పైప్లైన్ పనులను బుధవారం వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి కాలనీ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
30 ఏళ్ల తర్వాత సాకారమైన కల
ఈ సందర్భంగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జున కాలనీ ఏర్పడినప్పటి నుండి, అంటే సుమారు 30 ఏళ్లుగా ఇక్కడ సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు నరకయాతన అనుభవించారని తెలిపారు. గత పాలకులు ఎవరూ ఈ సమస్యను గుర్తించలేదని విమర్శించారు. కాలనీలోని కమ్యూనిటీ హాల్ నుండి రోడ్ నంబర్ 2 వరకు ఈ కొత్త పైప్లైన్ పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నట్లు వెల్లడించారు.
ప్రజల సహకారం అభినందనీయం
అభివృద్ధి పనుల కోసం కాలనీవాసులు చూపిన చొరవను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణం కోసం తమ ఇళ్ల కాంపౌండ్ వాల్స్ పోయినా, కమ్యూనిటీ హాల్ గోడ కూలిపోయినా పర్వాలేదు, మాకు శాశ్వత డ్రైనేజీ సౌకర్యం కావాలని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. వారి సహకారంతోనే ఈ పనులు సాఫీగా సాగుతున్నాయని పేర్కొన్నారు.
సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు
ఎన్నో ఏళ్ల గోడును విన్నవించుకున్న వెంటనే స్పందించి, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో నిధులు మంజూరు చేయించినందుకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జున కాలనీ ప్రెసిడెంట్ లక్ష్మణ్, అసోసియేషన్ సభ్యులు, క్రిస్టియన్ కాలనీ ప్రతినిధి హరేందర్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్ మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

