-
దిల్సుఖ్నగర్ వరకు నిరుద్యోగులతో కలిసి భారీ పాదయాత్ర
-
ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్న
-
జీవో 29, 46లను రద్దు చేయాలని డిమాండ్
ఎల్బీనగర్, మే 13
: రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లను తక్షణమే విడుదల చేయాలని, నిరుద్యోగుల ఆత్మహత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నిరుద్యోగ యువతకు మద్దతుగా ఆయన దిల్సుఖ్నగర్ వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని కోరారు.
హామీలు అమలు కాలేదు..
ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని, మెగా డీఎస్సీపై స్పష్టత లేకపోవడంతో వేలాది మంది అభ్యర్థులు నిరాశలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జీవోల రద్దు.. సిట్ విచారణకు డిమాండ్
నిరుద్యోగులకు శాపంగా మారిన జీవో 29 మరియు జీవో 46లను వెంటనే రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రూప్-1 నియామక ప్రక్రియలో తలెత్తిన అనుమానాలపై ప్రభుత్వం స్పందించాలని, దీనిపై సిట్ (SIT) ఎంక్వయిరీ నిర్వహించి పారదర్శకతను నిరూపించుకోవాలని సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని హెచ్చరించారు.
పాల్గొన్న నేతలు
ఈ పాదయాత్రలో సీనియర్ నాయకులు బిచేనేపల్లి వెంకటేశ్వరరావు, గడ్డిఅన్నారం మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, రమణారెడ్డి, శైలజ, గండి సన్నీ యాదవ్, ప్రతీక్, శివరాం, విక్కీ మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు. జై నిరుద్యోగి.. జై జై నిరుద్యోగి అంటూ యువత చేసిన నినాదాలతో దిల్సుఖ్నగర్ ప్రాంతం మార్మోగింది.

