-
566 మార్కులతో సత్తా చాటిన కుంట రక్షితా రాణి -
హనుమాన్ బస్తిలో సంబరాలు.. ప్రముఖుల ప్రశంసలు
బెల్లంపల్లి, ఏప్రిల్ 30: పదవ తరగతి ఫలితాల్లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన విద్యార్థిని కుంట రక్షితా రాణి అద్భుత ప్రతిభ కనబరిచి వరంగల్ జిల్లా స్థాయిలో రెండో ర్యాంకును కైవసం చేసుకుంది. బుధవారం విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాల్లో ఆమె సాధించిన విజయం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
566 మార్కులతో ప్రభంజనం
బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తికి చెందిన కుంట రమ్య – వెంకటేష్ ల కుమార్తె రక్షితా రాణి, వరంగల్ జిల్లాలోని శ్రీ చైతన్య పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో ఆమె 566 మార్కులు సాధించి, వరంగల్ జిల్లా స్థాయిలోనే ద్వితీయ స్థానంలో నిలిచి సత్తా చాటింది.
అభినందనల జల్లు
జిల్లా స్థాయి ర్యాంకు సాధించిన రక్షితా రాణిని ఆమె తల్లిదండ్రులతో పాటు బెల్లంపల్లి పట్టణ ప్రముఖులు, విద్యావేత్తలు ఘనంగా అభినందించారు. కష్టపడి చదివి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. తన కూతురు జిల్లా స్థాయిలో ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా బిడ్డ అయి ఉండి పొరుగు జిల్లాలో టాపర్గా నిలవడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.




