-
భూ నిర్వాసితులను భయాందోళనకు గురిచేస్తున్నారు
-
కమిషన్ల కోసమే ఎంపీ, ఎమ్మెల్యేల ఆరాటం
-
బెల్లూరి గ్రామంలో నిర్వాసితుల సమావేశంలో మాజీ మంత్రి ధ్వజమెత్తం
ఆదిలాబాద్, ఏప్రిల్ 30: ఆదిలాబాద్‌లోని సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పరిశ్రమ పునఃప్రారంభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. బుధవారం బెల్లూరి గ్రామంలో భూ నిర్వాసితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
స్పష్టత లేని అభివృద్ధి.. రాజకీయ పబ్బం
ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. సీసీఐ పునఃప్రారంభంపై ఎంపీ, ఎమ్మెల్యేలకు కనీస స్పష్టత లేదని విమర్శించారు. “ఒకవైపు సీసీఐ పునఃప్రారంభం ఊసే ఎత్తకుండా, మరోవైపు ఎయిర్పోర్ట్ పేరుతో భూ నిర్వాసితులను, పట్టణ ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారు” అని ధ్వజమెత్తారు. రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వకుండా వారి భూములను లాక్కోవాలని చూడటం దారుణమన్నారు.
మోదీ, అమిత్ షా హామీలు ఏమయ్యాయి?
గత ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా స్వయంగా ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమను తెరిపిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కమిషన్ల కోసం ప్రాకులాడుతున్నారని, జిల్లా ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. యువతకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యతను విస్మరించడం సమంజసం కాదని పేర్కొన్నారు.
పోరాటానికి సిద్ధం.. బీఆర్ఎస్ అండగా ఉంటుంది
భూ నిర్వాసితులకు, బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని జోగు రామన్న భరోసా ఇచ్చారు. సీసీఐ పునఃప్రారంభం అయ్యే వరకు, నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు ధర్నాలు, నిరసనలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తామని హెచ్చరించారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో ప్రభుత్వాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
పాల్గొన్న వారు: ఈ కార్యక్రమంలో నాయకులు ఇజ్జగిరి నారాయణ, కస్తాల అరుణ్, బొల్లు ఈశ్వర్ దాస్, కస్తాల ప్రేమల, విఠల్, అంశెట్టి రాజన్న, సంకేత్, అశోక్ మరియు పెద్ద సంఖ్యలో భూ నిర్వాసితులు పాల్గొన్నారు.

