-
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివరాలు నమోదు చేసిన మంత్రి
-
మే 10 వరకు కొనసాగనున్న జనగణన ప్రక్రియ
ధర్మపురి, ఏప్రిల్ 29
: దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జనగణన 2027’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం తన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన స్వీయ గణన (Self-Enumeration) ప్రక్రియను పూర్తి చేశారు.
ప్రతి ఒక్కరూ వివరాలు నమోదు చేసుకోవాలి
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి, ప్రభుత్వ పథకాల రూపకల్పనకు జనగణన అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఏప్రిల్ 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కుటుంబ వివరాలను పక్కాగా నమోదు చేసుకోవాలని కోరారు. ఆన్లైన్ విధానం ద్వారా వివరాల నమోదు సులభతరంగా మారిందని, సాంకేతికతను వినియోగించుకుని ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధికి దిక్సూచి
ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలంటే ఖచ్చితమైన జనాభా లెక్కలు ఉండాలని మంత్రి అభిప్రాయపడ్డారు. అధికారులు అడిగిన వివరాలను ప్రజలు పారదర్శకంగా తెలపాలని, జనగణన సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.




