-
‘గాంజా గస్తీ’ బ్యానర్‌ను ఆవిష్కరించిన ఎస్పీ డా. జి. జానకి షర్మిల
-
99 రోజుల ప్రజా ప్రణాళికలో భాగంగా అక్రమ రవాణాపై ఉక్కుపాదం
-
సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడి
నిర్మల్, ఏప్రిల్ 27
: జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై నిర్మల్ పోలీసు యంత్రాంగం యుద్ధం ప్రకటించింది. 99 రోజుల ప్రజా ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గాంజాను జిల్లా నుండి పూర్తిగా తరిమికొట్టేందుకు ఉక్కుపాదం మోపుతున్నట్లు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో “గాంజా గస్తీ” ప్రత్యేక ప్రచార బ్యానర్‌ను ఆమె ఆవిష్కరించారు.
కట్టుదిట్టమైన నిఘా – ప్రత్యేక బృందాలు
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో గాంజా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రధానంగా యువతను ఈ వ్యసనాల నుంచి కాపాడటం తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా గాంజా విక్రయాలు, రవాణా జరిగే ప్రాంతాలను గుర్తించి, కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశామని.. ప్రత్యేక బృందాల (Special Teams) ద్వారా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
యువత భవిష్యత్తు నాశనం కావొద్దు
మాదక ద్రవ్యాలకు అలవాటు పడి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్పీ హితవు పలికారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు గాంజా వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. “గాంజాను పూర్తిగా తరిమికొడతాం.. జిల్లాలో మాదక ద్రవ్యాలకు చోటు లేకుండా చేస్తాం” అని ఆమె గట్టిగా పునరుద్ఘాటించారు.
ప్రజల భాగస్వామ్యం అవసరం
గాంజా రహిత జిల్లా నిర్మాణంలో ప్రజల సహకారం చాలా కీలకమని ఎస్పీ కోరారు. ఎక్కడైనా గాంజా విక్రయాలు, వినియోగం లేదా అక్రమ నిల్వల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




