-
ప్రజల ముంగిటకే పోలీస్ సేవలు: ఎస్పీ డా. జి. జానకి షర్మిల
-
ఫిర్యాదులపై తక్షణ స్పందన.. అధికారులకు కీలక ఆదేశాలు
-
షీ టీం కౌన్సిలింగ్‌తో కలిసిన విడిపోయిన కుటుంబాలు
భైంసా, ఏప్రిల్ 24
: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా నిర్మల్ జిల్లా పోలీస్ యంత్రాంగం పనిచేస్తోందని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ పేర్కొన్నారు. శుక్రవారం భైంసాలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ‘గ్రీవెన్స్ డే’ (ప్రజా ఫిర్యాదుల విభాగం) కార్యక్రమంలో ఆమె స్వయంగా పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం
భైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన బాధితులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమక్షంలోనే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి, కేసుల పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా బాధితులకు తక్షణమే సహాయం అందించాలని, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
మరల కలిసిన కుటుంబాలు
ఈ కార్యక్రమంలో భార్యాభర్తల గొడవలు, కుటుంబ వివాదాలకు సంబంధించిన పలు ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ ఆదేశాల మేరకు ‘షీ టీం’ సిబ్బంది ఇరువర్గాలకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. అధికారుల చొరవతో మనస్పర్థలు వీడి పలు కుటుంబాలు తిరిగి కలుసుకోవడం విశేషం. జిల్లా కేంద్రమైన నిర్మల్ వరకు వెళ్లే శ్రమ తప్పించి, భైంసాలోనే ఈ సదుపాయం కల్పించడంపై బాధితులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.
పెండింగ్ ఫైళ్లపై సమీక్ష
గత గ్రీవెన్స్ డే సందర్భాల్లో వచ్చిన ఫిర్యాదుల స్థితిగతులపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఏ ఏ కారణాల వల్ల ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయో అధికారులను ఆరా తీశారు. ప్రజలు పోలీసులపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పారదర్శకంగా దర్యాప్తు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో భైంసా సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, షీ టీం సిబ్బంది మరియు ఐలాపూర్, నందిపేట్ పరిసర గ్రామాల బాధితులు పాల్గొన్నారు.




