-
ఆర్మూర్ ఇంచార్జ్ వినయ్ రెడ్డితో కలిసి మంత్రిని కోరిన సర్పంచ్ లక్ష్మీనారాయణ
-
సానుకూలంగా స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
నందిపేట్, ఏప్రిల్ 24
: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామ అభివృద్ధి, విద్యార్థుల సౌకర్యార్థం సర్పంచ్ మీసాల లక్ష్మీనారాయణ మరో ముందడుగు వేశారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ రెడ్డితో కలిసి రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎస్సీ బాలుర వసతి గృహానికి సంబంధించిన సమస్యలపై మంత్రికి వినతి పత్రాన్ని సమర్పించారు.
ఇంటర్ విద్యార్థులకూ వసతి కల్పించాలి
గ్రామంలో ప్రస్తుతం ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహంలో కేవలం ఎస్ఎస్సీ (10వ తరగతి) వరకు చదువుకునే విద్యార్థులకు మాత్రమే ప్రవేశం ఉందని సర్పంచ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సదరు భవనంలో సరిపడా గదులు మరియు అదనపు వసతులు ఉన్నాయని, కావున ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కూడా అక్కడ వసతి పొందేలా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. దీనివల్ల ఉన్నత విద్య అభ్యసించే పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు.
మంత్రి సానుకూల స్పందన
సర్పంచ్ విన్నపంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సానుకూలంగా స్పందించారని, ఇంటర్ విద్యార్థులకు వసతి కల్పించే విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సర్పంచ్ లక్ష్మీనారాయణ తెలిపారు. గ్రామంలో విద్యార్థుల సౌకర్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సర్పంచ్‌ను మరియు సహకరించిన వినయ్ రెడ్డిని గ్రామస్తులు అభినందిస్తున్నారు.




