-
ఈనెల 28న విద్యుత్ సౌధ ముట్టడి: వాల్ పోస్టర్ ఆవిష్కరణ
-
రావలసిన బకాయిలు రాకపోతే సింగరేణి దివాలా తీయడం ఖాయం
-
ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధుల తీరుపై కార్మిక నేతల ధ్వజం
రామకృష్ణాపూర్, ఏప్రిల్ 24
: సింగరేణి సంస్థకు వివిధ ప్రభుత్వ సంస్థల నుండి రావాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ బకాయిల వసూలు కోసం ఈనెల 28న హైదరాబాద్లోని విద్యుత్ సౌధ ముందు నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను శుక్రవారం రామకృష్ణాపూర్ సీహెచ్పీలో ఆవిష్కరించారు.
వినూత్న నిరసనలకు శ్రీకారం
ఈ సందర్భంగా సీఐటీయూ బ్రాంచ్ అధ్యక్షులు ఎస్. వెంకటస్వామి మాట్లాడుతూ.. సంస్థకు రావలసిన బకాయిలు కొండలా పేరుకుపోతుంటే సింగరేణి ఆర్థికంగా ఎలా నిలదొక్కుకుంటుందని ప్రశ్నించారు. “ప్రజాప్రతినిధులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదు. అందుకే నేరుగా బకాయిలు పడ్డ సంస్థల వద్దే నిరసనలు తెలపాలని నిర్ణయించాం. విద్యుత్ సౌధ ముట్టడి కేవలం ప్రారంభం మాత్రమే, భవిష్యత్తులో మిగిలిన సంస్థల ముందు కూడా ధర్నాలు చేస్తాం” అని హెచ్చరించారు.
రాజకీయ అవసరాలకే సింగరేణి వాడుక
లాభాలు వస్తే తమ వల్లే వచ్చాయని గొప్పలు చెప్పుకునే ప్రజాప్రతినిధులు, బకాయిల వసూలులో మాత్రం చొరవ చూపడం లేదని దుయ్యబట్టారు. రాజకీయ నేతలు తమ అవసరాల కోసం సింగరేణిని వాడుకుంటున్నారే తప్ప, సంస్థ మనుగడ గురించి ఆలోచించడం లేదని విమర్శించారు. ఇప్పటికే మెడికల్ బోర్డు వంటి సౌకర్యాలు మూతపడుతున్నాయని, బకాయిలు రాకపోతే అతి త్వరలో సంస్థ దివాలా తీయడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పెద్దలు మేల్కోవాలి
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలను వెంటనే ఇప్పించాలని, అవసరమైతే సంస్థ లాభాలను తగ్గించుకోనైనా సరే రావాల్సిన బకాయిల కోసం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేఎస్పీటీ-1 ఇంచార్జ్ ఐందాల శీను, పిట్ సెక్రటరీ గుజ్జ సతీష్, సీహెచ్పీ కార్మికులు మరియు యూనియన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




