మందమర్రి, ఏప్రిల్ 16: రహదారి భద్రతపై అవగాహన పెంచడం మరియు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మందమర్రి పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మందమర్రి పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాలు మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, పెట్రోలు బంకుల్లో ఇకపై ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’ నిబంధనను కఠినంగా అమలు చేయనున్నట్లు సీఐ పర్స రమేష్ తెలిపారు.
మందమర్రి పోలీస్ స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సీఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో తలకు గాయాలు తగ్గి ప్రాణాలు కాపాడుకోవచ్చని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వాహనదారులు హెల్మెట్ ధరించి రావాలని, లేనిపక్షంలో ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. ప్రజలకు అవగాహన కల్పించే ముందు పోలీసు సిబ్బంది స్వయంగా హెల్మెట్ ధరించి ఆదర్శంగా నిలవాలని ఆయన ఆదేశించారు.
‘సురక్షిత ప్రయాణం – సుఖమయ జీవితం’ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించేలా చైతన్యపరచడమే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం లక్ష్యమని సీఐ వివరించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఎస్సై, పోలీసు సిబ్బంది మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పోలీసులు హెల్మెట్లు ధరించి పట్టణంలో నిర్వహించిన అవగాహన ర్యాలీ స్థానికుల దృష్టిని ఆకర్షించింది.




