Studio18 News - జాతీయం / : రక్షణ పరిశోధన రంగంలో భారతదేశం పూర్తి స్వావలంబన సాధించిందనీ, ప్రపంచానికే నాయకత్వం వహించే దిశగా ఎదుగుతోందని భారత రక్షణ శాస్త్రవేత్త జి. సతీశ్ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా ఆవనిగడ్డ గాంధీ క్షేత్రంలో మండలి వెంకట కృష్ణారావు 99వ జయంతి వేడుకల్లో పాల్గొన్న సతీశ్ రెడ్డి .. రక్షణ పరిశోధన రంగంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తయారు చేసిన 155 ఎంఎం గన్ ప్రపంచంలో మరే దేశం వద్ద ఇప్పటికీ లేదని ఆయన పేర్కొన్నారు. భారత దేశం రక్షణ రంగ ఎగుమతుల్లో త్వరలో రూ.50వేల కోట్ల నుండి రూ.80వేల కోట్ల స్థాయికి ఎదిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కృష్ణాజిల్లా నిమ్మకూరులో ఏర్పాటు చేసిన బెల్ కంపెనీ ద్వారా త్వరలో ప్రపంచానికి ఎగుమతులు ఉంటాయని చెప్పారు. నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామంలోని క్షిపణి కేంద్ర నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. బెల్ కంపెనీ, నాగాయలంకలో ఏర్పాటు చేస్తున్న క్షిపణి పరీక్ష కేంద్రం ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. కాగా, భారత రక్షణ శాస్త్రవేత్తగా పని చేస్తున్న సతీశ్ రెడ్డి .. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు.
Admin
Studio18 News