Studio18 News - జాతీయం / : మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆలయ గోడ కూలిన ఘటనలో 9 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. షాపూర్‌లోని హర్దౌల్ బాబా ఆలయంలో పూజా కార్యక్రమం జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన చిన్నారులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులతో కలిసి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. మృతి చెందిన చిన్నారులు 10 నుంచి 15 ఏళ్ల లోపు వారేనని అధికారులు తెలిపారు. చిన్నారుల మృతి తనను కలచివేసిందని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల సాయం ప్రకటించారు. రేవా జిల్లాలో ఇటీవల గోడ కూలిన ఘటనలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. స్కూలు నుంచి వస్తున్న 5 నుంచి ఏడేళ్ల వయసున్న చిన్నారులపై గోడ కూలడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. గోడ కూలిన ఇంటి యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతలోనే సాగర్ జిల్లాలో ఘటన జరగడం అందరినీ కలచివేసింది.
Admin
Studio18 News