Studio18 News - జాతీయం / : ఒడిశాలోని ప్రసిద్ధ చిల్కా సరస్సు దగ్గర అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. సరస్సు మీదుగా ఓ టోర్నడో లాంటి ప్రకృతి దృశ్యం పర్యాటకులనే కాదు స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. ఇది వాటర్‌స్పౌట్‌గా గుర్తించారు. కొన్ని నిమిషాలపాటు కొనసాగి తర్వాత క్రమంగా కనుమరుగైంది. ఈ ఘటన జరిగిన సమయంలో సరస్సు ఒడ్డున పర్యాటకులు, మత్స్యకారులు సమీపంలోనే ఉండడంతో అందరూ ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించలేదు. ఈ దృశ్యం కృష్ణప్రసాద్ బ్లాక్‌లోని కలిజాయి దేవాలయ సమీపంలో చోటుచేసుకుంది. వర్షం అనంతరం ఏర్పడిన ఓ మేఘం, సరస్సు మధ్య భాగంలో వేగంగా తిరుగుతూ టోర్నడోలా మలుపులు తిరిగినట్లుగా కనిపించింది. అక్కడున్న చాలామంది పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాన్ని చిత్రీకరించగా, స్థానిక మత్స్యకారులు మాత్రం ఈ అపూర్వమైన పరిణామాన్ని చూసి ఆందోళన చెందారు. ఒడిశా వాతావరణ శాఖ నిపుణుడు బిశ్వజిత్ సహూ ఈ ఘటనపై స్పందిస్తూ ఇది వాటర్‌స్పౌట్ అని స్పష్టం చేశారు. ఇది సాధారణంగా పెద్ద నీటి మైదానాలు, సముద్ర తీరాల్లో ఏర్పడే ఒక తాత్కాలిక వాతావరణ పరిస్థితి అని తెలిపారు. అమెరికా, కెనడా వంటి దేశాల్లో ఇది ఎక్కువగా కనిపించే ఘటన. కానీ భారతదేశంలో ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో కొన్ని వాటర్‌స్పౌట్‌లు నమోదు అయ్యాయి. అయితే ఒడిశాలో మాత్రం ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయని ఆయన వివరించారు. ఇలాంటి టోర్నడోలు సాధారణంగా వేడి, తేమతో కూడిన గాలి పైకి ఎగసి, చల్లని పొడి గాలిని ఢీకొన్నపుడు ఏర్పడతాయి. ఈ ఘటన వలన మేఘాలు వేగంగా కదిలి, గాలి దిశ మారి, ఎత్తు పెరిగే కొద్దీ ఒక చక్రంలా తిరుగుతూ వాటర్‌స్పౌట్‌ను ఏర్పరుస్తుంది. ఇవి సాధారణంగా సముద్రాల మీద గానీ, పెద్ద సరస్సులపై గానీ మాత్రమే కనిపిస్తాయి అని పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత చిల్కా సరస్సు పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్విగ్నత నెలకొంది. అయితే దాని ప్రభావం త్వరగా తగ్గిపోవడంతో ప్రజలు మళ్లీ సాధారణ కార్యకలాపాలకు మళ్లారు. కలిజాయి దేవాలయానికి వచ్చిన పర్యాటకులందరూ తమ మొబైల్ కెమెరాల్లో ఈ అద్భుత దృశ్యాన్ని చిత్రీకరించడం ఒక అద్భుత అనుభూతిగా మిగిలింది.
Admin
Studio18 News