Studio18 News - అంతర్జాతీయం / : Nobel Prize | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ట్రంప్ ‘శాంతి’ ఆశలపై నీళ్లు చల్లుతూ 2025 నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) వెనెజువెలా ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు, ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న మరియా కొరీనా మచాడోకు (Maria Corina Machado) నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్‌ను కాకుండా వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేయడంపై వైట్‌హౌస్ (White House) అసంతృప్తి వ్యక్తం చేసింది. మచాడోని ఎంపిక చేయడం ద్వారా నోబెల్ కమిటీ శాంతి కన్నా రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించింది. వైట్‌హౌస్ విమర్శలపై నోబెల్ కమిటీ (Nobel committee) స్పందించింది. ‘శాంతి’ ప్రకటన విషయంలో నియమ, నిబంధనల ప్రకారమే నడుచుకున్నట్లు తెలిపింది. కమిటీ చైర్మన్ జోర్గెన్ వాట్నే ఫ్రైడ్నెస్ మాట్లాడుతూ.. ‘నోబెల్ అవార్డుల ఎంపికకు ముందు అన్నిరకాలుగా పరిశీలన జరుపుతాం. అవార్డు అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని నిర్దారించుకున్న తర్వాతే ఎంపిక చేస్తాం. నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ఏటా వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి. వాటన్నింటినీ పరిశీలించి నిజంగా శాంతి కోసం కృషి చేసే వ్యక్తులనే ఎంపిక చేస్తాం. నోబెల్ బహుమతి గ్రహీతల ఫొటోలు ఉన్న గదిలో కమిటీ కూర్చుంటుంది. ఆ గదిలో ధైర్యం, సమగ్రత నిండి ఉంటాయి. చేసిన కృషి, ఆల్ఫ్రెడ్ నోబెల్ అభీష్టంపైనే మా నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఇందులో ఇతర అంశాలు ఏవీ ప్రభావం చూపబోవు’ అని స్పష్టం చేశారు.
Admin
Studio18 News