Studio18 News - అంతర్జాతీయం / : టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య.. లెబనీస్ షియా ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్ ను ఇజ్రాయెల్ అంతమొందించిన నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులను మరింత రాజేస్తూ శనివారం కీలక పరిణామం జరిగింది. ఇజ్రాయెల్‌పై డజన్ల కొద్దీ రాకెట్లతో హిజ్బుల్లా దాడికి ప్రయత్నించింది. అయితే ఐదింటిని మినహా అన్ని రాకెట్లను ఇజ్రాయెల్ సేనలు కూల్చివేశాయి. ఈ దాడులను హిజ్బుల్లా ధృవీకరించింది. కాగా హిజ్బుల్లా - ఇజ్రాయెల్ మధ్య శుక్రవారం కూడా పరస్పర దాడులు జరిగాయి. ఇజ్రాయెల్‌లోని వెస్ట్ గెలీలీని లక్ష్యంగా చేసుకుని రాకెట్ దాడులు చేయగా వాటిని ఇజ్రాయెల్ సేనలు గాలిలోనే కూల్చివేశాయి. ప్రతీకార చర్యలో భాగంగా హిజ్బుల్లా దాడికి ఉపయోగించిన రాకెట్ లాంచర్‌ను ఇజ్రాయెల్ రక్షణ దళాలు ధ్వంసం చేశాయి. దానికి కొనసాగింపుగా శనివారం కూడా దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. కాగా శనివారం ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక చేసింది. హిజ్జుల్లా సైనిక లక్ష్యాలకే పరిమితం కాబోదని, ఇతర ప్రాంతాలపై కూడా గురిపెడుతుందని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఇజ్రాయెల్ ఆర్మీ పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. ఇదిలావుంచితే.. గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లో హమాస్ నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రతీకార చర్యగా హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. నాటి నుంచి, దాదాపు 10 నెలలుగా సరిహద్దులో ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పులు జరుగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌లోని ఓ ఫుట్‌బాల్ మైదానంపై హిజ్బుల్లా రాకెట్ దాడి చేయగా 13 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ దాడికి వ్యూహ రచన చేసిన హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్ ను ఇజ్రాయెల్ అంతమొందించింది. దీంతో హిజ్బుల్లా మరింత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. మరోవైపు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్‌కు హిజ్బుల్లా మద్దతు ప్రకటించింది.
Admin
Studio18 News