Studio18 News - జాతీయం / : జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నగరా మోగనుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన సెప్టెంబర్ 30వ తేదీ గడువు లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సన్నద్దం అవుతోంది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహాలను సమీక్షించేందుకు ఈసీ బృందం ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకూ జమ్మూకశ్మీర్ లో పర్యటించనున్నది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, ఎస్ఎస్ సంధు పర్యటిస్తారు. రాజకీయ పార్టీలతో తొలుత కమిషన్ సమావేశమవుతుంది. సీఈవో, ఎస్పీఎన్‌వో, సెంట్రల్ ఫోర్సెస్ కోఆర్డినేటర్ తోనూ సమీక్ష నిర్వహిస్తారు. అలాగే ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో కమిషన్ సమావేశమై ఎన్నికల సన్నాహకాలను సమీక్షిస్తుంది. ఆగస్టు 10న జమ్మూలో పర్యటించి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సమావేశం అవుతుంది. అనంతరం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించనుంది. సీఈసీ రాజీవ్‌కుమార్ 2024 లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందు, గత మార్చిలోనూ జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. ఆ సమయంలోనే యూటీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రజలకు, రాజకీయ పార్టీలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడంపైనా కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది.
Admin
Studio18 News