Studio18 News - జాతీయం / : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి సరైన నిర్వహణ లేదని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికార ప్రతినిధి జైరాజ్‌సింహ్ పర్మార్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రమాదానికి మూడు రోజుల ముందు తాను అదే విమానంలో ప్రయాణించానని, అప్పుడే పలు లోపాలను గమనించానని ఆయన తెలిపారు. లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్‌కు తాను ప్రయాణించిన సమయంలో విమానంలో జీపీఎస్ వ్యవస్థ సరిగా పనిచేయలేదని జైరాజ్‌సింహ్ పర్మార్ పేర్కొన్నారు. అంతేకాకుండా, సీట్లు కూడా దెబ్బతిని ఉన్నాయని, అంతర్గత టెలికం సేవలు అందుబాటులో లేవని, డెస్కులు కూడా సక్రమంగా పనిచేయడం లేదని ఆయన వివరించారు. "ఇతర అంతర్జాతీయ విమానయాన సంస్థల్లో అనేక సౌకర్యాలుంటాయి. కానీ దురదృష్టవశాత్తూ ఎయిర్ ఇండియాలో అవేవీ కనిపించవు. విమానానికి సరైన నిర్వహణ ఉన్నట్టు అనిపించలేదు" అని పర్మార్ అన్నారు. "ఎయిర్ ఇండియా" పేరులో "ఇండియా" అనే పదం ఉండటం వల్ల ఇటువంటి ఘటనలు మన దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని, ఇది బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
Admin
Studio18 News