Studio18 News - జాతీయం / : రాజా రఘువంశీ హత్య కేసులో అరెస్టయిన నిందితుల్లో ముగ్గురికి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ జడ్జి 7 రోజుల ట్రాన్సిట్ రిమాండ్ విధించారు. దాంతో నిందితులు ముగ్గురిని షిల్లాంగ్ పోలీసులు మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు తీసుకెళ్లి విచారించనున్నారు. కేసులో నాలుగో నిందితుడిని బినా జిల్లాలోని సాగర్ ఏరియా నుంచి ఇండోర్‌కు తీసుకొస్తున్నారు. ఇండోర్‌కు చేరుకోగానే అతడిని కూడా న్యాయమూర్తి ముందు హాజరుపర్చనున్నారు. అతడికి కూడా 7 రోజుల ట్రాన్సిట్ రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఆ తర్వాత పోలీసులు నలుగురిని షిల్లాంగ్‌కు తరలించనున్నారు. నిందితులు ఆకాశ్ రాజ్‌పుత్, విశాల్ సింగ్ చౌహాన్, రాజ్‌సింగ్ కుశ్వాహలకు ట్రాన్సిట్ రిమాండ్ విధించగా.. మరో నిందితుడు ఆనంద్‌ను కోర్టులో హాజరుపర్చాల్సి ఉంది. మరోవైపు యూపీలోని ఘాజీపూర్‌లో లొంగిపోయిన సోనమ్ రఘువంశీని పోలీసులు వైద్యపరీక్షల నిమిత్తం ఘాజీపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమెను కూడా షిల్లాంగ్ కు తరలించనున్నారు. సోనమ్ రఘువంశీనే కిరాయి హంతకులను పెట్టి భర్తను హత్య చేయించిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ మే 11న వివాహం చేసుకున్నారు. మే 20న మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు. మే 23 నుంచి ఇద్దరూ కనిపించకుండా పోయారు. దాంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు జూన్ 2న ఓ లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. సోనమ్ జాడ తెలియలేదు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున ఆమె ఘాజీపూర్‌లో లొంగిపోయింది.
Admin
Studio18 News