Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ పార్ట్ 1 విడుదల వాయిదా పడిన విషయం విదితమే. ఈ చిత్రం వాస్తవానికి జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సినిమా కొత్త విడుదల తేదీ గురించి పలు ఊహాగానాలు అంతర్జాలంలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. జూన్ 26న లేదా జులై మొదటి వారంలో సినిమా విడుదల కావొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రచారాలపై ‘హరిహర వీరమల్లు’ చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ స్పందించింది. సినిమా విడుదల తేదీ గురించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు 'ఎక్స్' ఖాతా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘హరిహర వీరమల్లు’ విడుదల తేదీ గురించి ఆన్‌లైన్‌లో వస్తున్న వార్తలను విశ్వసించవద్దు. త్వరలోనే మా అధికారిక సామాజిక మాధ్యమాల ఖాతాల ద్వారా కొత్త తేదీని ప్రకటిస్తాం. అప్పటివరకు మీ ఆదరణ, ప్రోత్సాహం ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాం’’ అని మెగా సూర్య ప్రొడక్షన్స్ తమ ప్రకటనలో పేర్కొంది. తొలుత ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. ఆయన కొంత భాగం చిత్రీకరించిన తర్వాత నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. సినిమా నిర్మాణం ఆలస్యం కావడం, నిర్మాత ఏఎం రత్నంపై ఆర్థిక భారం పడటంతో పవన్ కల్యాణ్ తాను ముందుగా తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశారు. చారిత్రక నేపథ్యమున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, బాబీ దేవోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Admin
Studio18 News