Studio18 News - జాతీయం / : భార్యతో కలిసి హనీమూన్ కోసం మేఘాలయ వచ్చిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడన్న వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, తొలుత తాను నమ్మలేకపోయానని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్ టిన్‌సోంగ్ అన్నారు. ఈ ఘటన నేపథ్యంలో పర్యాటకుల భద్రతపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మేఘాలయ రాష్ట్రం తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున దేశంలోని పర్యాటకులందరికీ తాను ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నానని టిన్‌సోంగ్ తెలిపారు. "మా రాష్ట్రం పర్యాటకులకు అత్యంత సురక్షితమైన ప్రదేశం. ఈ హత్య ఘటనను అడ్డం పెట్టుకుని కొందరు వ్యక్తులు మేఘాలయ పర్యాటకులకు సురక్షితం కాదంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. దయచేసి అలాంటి నిరాధారమైన ప్రచారాలను నమ్మవద్దు. టూరిస్టులు ఎలాంటి సంకోచం లేకుండా మా రాష్ట్రంలో పర్యటించవచ్చు," అని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. పర్యాటకుల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. కాగా, మధ్యప్రదేశ్‌కు చెందిన రాజా రఘువంశీ అనే వ్యక్తి తన భార్య సోనమ్ రఘువంశీతో కలిసి హనీమూన్ ట్రిప్ కోసం మేఘాలయకు వచ్చారు. గత నెల (మే) 23వ తేదీన రాజా రఘువంశీ హత్యకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ హత్య కేసులో అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజా రఘువంశీ భార్య సోనమ్ రఘువంశీనే కిరాయి హంతకులను పెట్టి తన భర్తను హత్య చేయించిందన్న ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సోమవారం సోనమ్ రఘువంశీ మాట్లాడుతూ, భర్త తనను రక్షించే ప్రయత్నంలో దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ రెండు కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదిలావుంటే, రాజా రఘువంశీ మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఆయన తలకు ముందు, వెనుక భాగాల్లో రెండు బలమైన గాయాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ గాయాల వల్లే ఆయన మృతి చెంది ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు.
Admin
Studio18 News