Studio18 News - జాతీయం / : తాను ప్రధాన పాత్రలో నటిస్తున్న 'కన్నప్ప' చిత్రం ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశంతో రూపొందించలేదని నటుడు మంచు విష్ణు స్పష్టం చేశారు. ఈ సినిమాలోని కొన్ని పాత్రల పేర్ల విషయంలో తలెత్తిన అభ్యంతరాలపై స్పందిస్తూ, చిత్రం రూపకల్పనలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 'కన్నప్ప' చిత్రంలో నటులు బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన పాత్రల పేర్లు (పిలక, గిలక) తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆ పేర్లను సినిమా నుంచి తొలగించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని కూడా బ్రాహ్మణ సంఘాల నేతలు హెచ్చరించారు. ఈ వివాదంపై మంచు విష్ణు మాట్లాడుతూ, "ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఎంతో శ్రద్ధతో సినిమాను తీర్చిదిద్దాం. హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ, పరమశివుడిని అత్యంత భక్తితో చూపించాం" అని అన్నారు. చిత్రీకరణ సమయంలో ప్రతిరోజూ సెట్‌కు వెళ్లేముందు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నామని ఆయన గుర్తుచేశారు. "స్క్రిప్ట్ దశలోనే వేదాధ్యయనం చేసిన పండితులు, పలువురు ఆధ్యాత్మికవేత్తల నుంచి విలువైన సూచనలు, సలహాలు స్వీకరించాం" అని విష్ణు వివరించారు. 'కన్నప్ప' చిత్రం తీయడం వెనుక ప్రధాన ఉద్దేశం భక్తితత్వాన్ని వ్యాప్తి చేయడమేనని, వివాదాలు సృష్టించడం కాదని మంచు విష్ణు నొక్కిచెప్పారు. "సినిమా విడుదలయ్యే వరకు దయచేసి ప్రతి ఒక్కరూ సంయమనం పాటించండి. సినిమా చూడకముందే ఒక నిర్ధారణకు రావద్దు" అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రం ద్వారా భక్తి భావాన్ని ప్రేక్షకులకు అందించాలన్నదే తమ ప్రయత్నమని ఆయన పునరుద్ఘాటించారు.
Admin
Studio18 News