Studio18 News - అంతర్జాతీయం / : అమెరికాలోని ప్రముఖ నగరం లాస్ ఏంజెలెస్ వలసదారుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) విభాగానికి వ్యతిరేకంగా చెలరేగిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో నగరం రణరంగాన్ని తలపిస్తోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. హైవే దిగ్బంధం, వాహనాలకు నిప్పు దాదాపు 2,000 మంది ఆందోళనకారులు లాస్ ఏంజెలెస్ డౌన్‌టౌన్‌లోని ప్రధాన 101 ఫ్రీవేను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో అధికారులు ఆ మార్గాన్ని పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. నిరసనకారులు పలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు, పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. భద్రతా సిబ్బందిపైకి వివిధ వస్తువులు విసురుతూ దాడులకు ప్రయత్నించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన చర్యల్లో భాగంగా ఒక విలేకరికి రబ్బరు తూటా తగిలింది. శాంతిభద్రతల దృష్ట్యా డౌన్‌టౌన్ వాణిజ్య ప్రాంతంలో ప్రజలు గుమికూడరాదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ కఠిన చర్యలు... మస్క్ మద్దతు ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. లాస్ ఏంజెలెస్‌లో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు 2,000 మంది నేషనల్ గార్డ్స్‌ను రంగంలోకి దించాలని ఆదేశించారు. ఇప్పటికే 300 మంది సైనికులు నగరానికి చేరుకున్నారు. ఆదివారం జరిగిన ఆందోళనల నేపథ్యంలో, నిరసనల్లో మాస్కులు ధరించడాన్ని నిషేధిస్తూ, మాస్కులతో కనిపించిన వారిని అరెస్టు చేయాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మద్దతు పలకడం గమనార్హం. లాస్ ఏంజెలెస్‌కు నేషనల్ గార్డ్స్‌ను పంపాలన్న ట్రంప్ నిర్ణయాన్ని సమర్థిస్తూ మస్క్ 'ఎక్స్' వేదికగా పోస్టులు చేశారు. కాలిఫోర్నియా గవర్నర్, లాస్ ఏంజెలెస్ మేయర్‌లు ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ ట్రంప్ చేసిన పోస్టు స్క్రీన్‌షాట్‌ను మస్క్ పంచుకున్నారు. లాస్ ఏంజెలెస్‌లో నెలకొన్న పరిస్థితులపై అధ్యక్షుడు ట్రంప్, స్థానిక నాయకత్వం మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తోంది. నగర మేయర్ కరెన్ బాస్ మాట్లాడుతూ, ఆందోళనలు శాంతియుతంగా జరగాలని పిలుపునిచ్చారు. ట్రంప్ వ్యవహార శైలిని ఆమె తప్పుబట్టారు. "లాస్ ఏంజెలెస్‌లోని పరిస్థితిని పాలకవర్గమే రెచ్చగొట్టింది. పని ప్రదేశాలపై దాడులు చేస్తూ తల్లిదండ్రులను, పిల్లలను వేధిస్తూ, సాయుధ బలగాలతో వీధుల్లో కవాతు చేయించి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు" అని కరెన్ బాస్ ఆరోపించారు. మరోవైపు, "ఒకప్పుడు అమెరికాలో గొప్ప నగరంగా వెలుగొందిన లాస్ ఏంజెలెస్‌ను అక్రమ వలసదారులు, క్రిమినల్స్ ఆక్రమించుకున్నారు" అంటూ ట్రంప్ సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలతో లాస్ ఏంజెలెస్‌లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.
Admin
Studio18 News