Studio18 News - జాతీయం / : సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. మీ కస్టమర్ అకౌంట్ (కేవైసీ)ని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిలిపివేసిందని, 24 గంటల్లోగా మీ సిమ్ కార్డు బ్లాక్ అవుతుందంటూ తప్పుడు సందేశాలు పంపిస్తున్నారు. దీంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. మోసగాళ్లు పంపుతున్న ఈ నకిలీ సందేశంలో, సమస్యను పరిష్కరించుకోవడానికి వెంటనే ఒక నిర్దిష్ట ఫోన్ నంబర్‌కు కాల్ చేయాలని సూచిస్తున్నారు. ఈ విధంగా అమాయకుల నుంచి వ్యక్తిగత సమాచారం తస్కరించి, వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడమే ఈ కేటుగాళ్ల లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ తరహా మోసపూరిత సందేశాలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ)కు చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం దీనిపై స్పష్టతనిచ్చింది. ‘‘బీఎస్‌ఎన్‌ఎల్ పేరుతో వస్తున్న ఈ సందేశం పూర్తిగా నకిలీది. బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ సిమ్ కేవైసీకి సంబంధించి ఎలాంటి నోటీసులను వినియోగదారులకు పంపించదు. ఇలాంటి మోసపూరిత సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం 'ఎక్స్' వేదికగా స్పష్టం చేసింది. ఏదైనా వార్తను లేదా సందేశాన్ని గుడ్డిగా నమ్మవద్దని, ఇతరులకు షేర్ చేసే ముందు దాని యదార్థతను అధికారిక వర్గాల ద్వారా ధృవీకరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇలాంటి మోసాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని, అనుమానాస్పద లింకులు లేదా ఫోన్ నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏదైనా అనుమానం వస్తే, వెంటనే బీఎస్‌ఎన్‌ఎల్ అధికారిక కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.
Admin
Studio18 News