Studio18 News - జాతీయం / : Wayanad Landslides : కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేసిన ఘటనలో..మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, కేఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. శుక్రవారం ఉదయం వరకు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 316కు చేరింది. మృతుల్లో 27 పిల్లలు, 76 మంది మహిళలు ఉన్నారు. 220 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. నాలుగు రోజులుగా వాయనాడ్ జిల్లాలో మెప్పాడి, ముండకై, చురల్మల, అత్తమల, నూల్ పుజ ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సహాయక చర్యల్లో మరింత వేగం పెంచారు. శిథిలాలు తొలగిస్తున్నా కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. సహాయక కార్యక్రమాల్లో వెయ్యి మందికిపైగా సిబ్బంది పాల్గొంటున్నారు. రికార్డు సమయంలో చూరల్‌మల – ముండక్కై మధ్య 190 అడుగుల బెయిలీ వంతెన నిర్మాణాన్ని ఆర్మీ విజయవంతంగా పూర్తి చేశారు. బుధవారం రాత్రి 9 గంటలకు ప్రారంభించి గురువారం సాయంత్రం 5:30 గంటలకు బెయిలీ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశారు. అట్టామల, ముండక్కై చూరల్‌మల వద్ద ప్రస్తుతం ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. వాయనాడ్‌లోని ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్‌లను మేజర్ జనరల్ వీటీ మాథ్యూ పర్యవేక్షిస్తున్నారు. చలియార్ నది నుంచి తీసుకొచ్చిన మృతదేహాలను గుర్తించడంలో కుటుంబ సభ్యులుకు కష్టంగా మారుతుంది. కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి 25 కిలో మీటర్ల దూరంలో నిలంబూరులోని చలియార్ నదిలో ఈ మృతదేహాలు దొరికాయి. ప్రొక్లేయినర్లు, జేసీబీలతో బురదను, శిథిలాలను సహాయక సిబ్బంది తొలగిస్తున్నారు. బండరాళ్లను పగలగొట్టి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఆధునిక సాంకేతిక యంత్రాలతో గల్లంతైన వారిని మట్టిలో కూరుకుపోయిన వారిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తిస్తున్నారు. వాయనాడ్‌లో జరిగిన ఘోర ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Admin
Studio18 News