Studio18 News - జాతీయం / : భోపాల్: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయింది. దీంతో గత కొన్ని రోజులుగా కరెంట్ సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. చివరకు కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను విద్యుత్ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌కు పూజలు చేశారు. (Puja to Transformer) బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. భిండ్‌లోని గాంధీ నగర్ ప్రాంతంలో 15 ఏళ్ల నాటి పాత విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఇటీవల కాలిపోయింది. దీంతో మండే వేసవిలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు గత 15 రోజులుగా ఇబ్బందిపడ్డారు. కాగా, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు గురించి విద్యుత్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు విసిగిపోయారు. చివరకు స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను విద్యుత్ శాఖ ఏర్పాటు చేసింది. గత కొన్ని రోజులుగా కరెంట్ లేక ఇబ్బంది పడిన స్థానికులు దీనిని పండుగలా జరుపుకున్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌కు పూజలు చేయడంతోపాటు హారతి ఇచ్చారు. స్థానికులకు స్వీట్లు పంచిపెట్టారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ చాలా కాలం పని చేయాలని దేవుడ్ని ప్రార్థించారు. మరోవైపు ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే దానిని మార్చేందుకు 15 రోజులకుపైగా పడుతుందని, అలాగే విద్యుత్ కార్యాలయం చుట్టూ తిరుగాల్సి ఉంటుందని స్థానికులు వాపోయారు. ఇలాంటి ఇబ్బందులు రాకుండా చాలా ఏళ్లు పని చేసేందుకు కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌కు పూజ చేసినట్లు వెల్లడించారు.
Admin
Studio18 News