Studio18 News - జాతీయం / : కొవిడ్ 19 కారణంగా మన దేశంలో 11.9 లక్షల మంది మృతి చెందినట్లుగా వెలువడిన అంతర్జాతీయ నివేదికపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొవిడ్ సమయంలో భారత్‌లో నివేదించిన మరణాల కన్నా చాలా ఎక్కువగా చోటు చేసుకున్నాయని ఓ అంతర్జాతీయ అధ్యయనం ఇటీవల వెల్లడించింది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. ఈ అధ్యయాన్ని ఖండిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇది తప్పుదోవ పట్టించే నివేదిక అని పేర్కొంది. అధ్యయనం చేసిన అంచనాలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని, లోపభూయిష్టమైన పద్ధతిలో వారు చేసిన అధ్యయనం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఎన్ఎఫ్‌హెచ్ఎస్ నుంచి సేకరించిన సమాచారాన్ని మొత్తం దేశానికి ఆపాదించలేమని పేర్కొంది. దేశంలోని సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అత్యంత విశ్వసనీయమైనదని పేర్కొంది. దేశంలోని 99 శాతం మరణాలు ఇందులో రికార్డ్ అవుతాయని తెలిపింది. 2019తో పోలిస్తే 2020లో మరణాలు 4.74 లక్షలు పెరిగినట్లు తెలిపింది. అంతకుముందు రెండేళ్లలోనూ ఇలాగే పెరుగుదల నమోదైనట్లు తెలిపింది. 2018లో 4.86 లక్షలు, 2019లో 6.90 లక్షలతో మరణాల్లో అత్యధిక పెరుగుదల నమోదైందని వెల్లడించింది. అత్యధికంగా నమోదైన మరణాలన్నీ కోవిడ్ కారణంగా అని చెప్పలేమని తెలిపింది. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయని వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సహా పలు విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. ఎన్ఎఫ్‌హెచ్ఎస్ నివేదికను విశ్లేషించి భారత్‌లో కరోనా విజృంభణ సమయంలో అత్యధిక మరణాలు చోటు చేసుకున్నట్లు నివేదికలో పేర్కొంది. ఈ కథనాన్ని కొన్ని మీడియా సంస్థలు ప్రచురించాయి. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది.
Admin
Studio18 News