Studio18 News - జాతీయం / : భారత సైన్యాధిపతి (సీఓఏఎస్) జనరల్ ఉపేంద్ర ద్వివేది నిన్న మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ప్రముఖ ఆథ్యాత్మిక గురువు జగద్గురు రాంభద్రాచార్యను కలిసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ను తిరిగి భారతదేశంలో కలపాలని, దానిని తనకు గురుదక్షిణగా సమర్పించాలని జగద్గురు రాంభద్రాచార్య ఆర్మీ చీఫ్‌ను కోరారు. ఈ సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జనరల్ ఉపేంద్ర ద్వివేది చిత్రకూట్‌లోని జగద్గురు ఆశ్రమానికి విచ్చేసినప్పుడు, ఆయనకు స్వామీజీ ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. లంకకు వెళ్లే ముందు హనుమంతునికి ఏ రామ్ మంత్ర దీక్షను ఇచ్చారో, అదే దీక్షను జనరల్ ద్వివేదికి కూడా ఇచ్చినట్లు జగద్గురు రాంభద్రాచార్య తెలిపారు. అనంతరం వారిద్దరి మధ్య ఆథ్యాత్మిక విషయాలపై చర్చ జరిగింది. ఆశ్రమంలోని ఇతర సాధువులు, విద్యార్థులతో కూడా ఆర్మీ చీఫ్ ముచ్చటించారు. ఈ భేటీ సందర్భంగా జగద్గురు రాంభద్రాచార్య, పీఓకేను తిరిగి సాధించి, దానిని తనకు గురుదక్షిణగా ఇవ్వాలని జనరల్ ద్వివేదిని కోరారు. హిందూ సంప్రదాయంలో గురువుకు శిష్యుడు సమర్పించే కానుక లేదా గౌరవాన్ని గురుదక్షిణ అంటారు. జగద్గురు రాంభద్రాచార్య ప్రఖ్యాత హిందూ ఆథ్యాత్మికవేత్త, సంస్కృత పండితుడు మరియు తత్వవేత్త. ఆయన అనేక గ్రంథాలను రచించారు. ఆయన వాక్కుకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. ఆర్మీ చీఫ్‌కు ఆయన చేసిన ఈ విజ్ఞప్తి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Admin
Studio18 News