Studio18 News - జాతీయం / : దేశంలో ఉగ్రవాద దాడుల ద్వారా అశాంతి సృష్టించాలని చూస్తే సహించేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్థాన్‌ను హెచ్చరించారు. దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ సూచనలను నాటి పాలకులు పెడచెవిన పెట్టడం వల్లే గత 76 ఏళ్లుగా దేశం ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా మంగళవారం నాడు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా 'ఆపరేషన్ సిందూర్' గురించి కూడా ప్రస్తావించారు. "ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ఒక యుద్ధ తంత్రంగా మార్చుకుంది. దీనిని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఆ దేశ ప్రభుత్వ అధికారులు హాజరై, ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. వారి సైన్యం కూడా ఉగ్రవాదులకు సెల్యూట్ చేసింది. ఇది ఉగ్రవాదం కేవలం పరోక్ష యుద్ధం కాదని, పాకిస్థాన్ అనుసరిస్తున్న యుద్ధ వ్యూహమని స్పష్టం చేస్తోంది. దీనికి తగిన రీతిలోనే భారత్ స్పందిస్తుంది" అని మోదీ అన్నారు. తాము శాంతినే కోరుకుంటామని, ఇతరులు కూడా శాంతియుతంగా ఉండాలనే ఆకాంక్షిస్తామని, అయితే పరోక్ష యుద్ధంతో తమ సహనాన్ని పరీక్షిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. 1947 నాటి దేశ విభజనను ప్రస్తావిస్తూ, "1947లో దేశం రెండుగా చీలిన రోజే, కశ్మీర్‌లో తొలి ఉగ్రదాడి జరిగింది. సాయుధ ముఠాల సాయంతో పాకిస్థాన్ కశ్మీర్‌లోని కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. ఆనాడు ఉగ్రవాదులను ఏరివేసి, ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఇచ్చిన సలహాను పాటించి ఉంటే, దేశంలో ఈ ఉగ్రదాడుల పరంపర కొనసాగేది కాదు. కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆ సూచనను పట్టించుకోలేదు" అని ప్రధాని విమర్శించారు. అప్పటి నుంచి పర్యాటకులు, యాత్రికులు, సామాన్య పౌరులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఘటనే దీనికి నిదర్శనమని అన్నారు.
Admin
Studio18 News