Studio18 News - జాతీయం / : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ దక్షతను, భారత భద్రతా దళాల అసమాన ధైర్యసాహసాలను కొనియాడారు. ముఖ్యంగా, 'ఆపరేషన్ సిందూర్' విజయం ఈ రెండింటికీ నిలువెత్తు నిదర్శనమని ఆయన ప్రశంసించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 'రైజింగ్ నార్త్‌ఈస్ట్ ఇన్వెస్టర్స్ సదస్సు'లో మాట్లాడుతూ అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు. ఢిల్లీలో రెండు రోజుల పాటు 'రైజింగ్ నార్త్‌ఈస్ట్ ఇన్వెస్టర్స్ సదస్సు' జరుగుతోంది. ఈశాన్య రాష్ట్రాలలో పెట్టుబడులను ఆకర్షించి, ఆ ప్రాంత అభివృద్ధికి ఊతమివ్వడమే ఈ సదస్సు యొక్క ప్రధాన లక్ష్యం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే మన దేశంలో, ఈశాన్య ప్రాంతం మరింత ప్రత్యేకమైన వైవిధ్యతను కలిగి ఉందని అన్నారు. ఈశాన్య భారతాన్ని ఒక 'పవర్‌హౌస్'గా, దేశానికి 'అష్టలక్ష్మి' వంటిదని ఆయన అభివర్ణించారు. ఇదే సదస్సులో పాల్గొన్న ముకేశ్ అంబానీ, ప్రధాని మోదీ నాయకత్వ పటిమకు సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు. అలాగే, దేశ భద్రత కోసం అహర్నిశలు పాటుపడుతున్న భద్రతా బలగాల సాహసోపేత చర్యలను ప్రశంసించారు. 'ఆపరేషన్ సిందూర్'పై ముకేశ్ అంబానీ గతంలోనూ స్పందించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఐక్యంగా, స్థిరంగా, దృఢ సంకల్పంతో పోరాడుతోందని ఆయన అన్నారు. మన సాయుధ దళాల శౌర్యపరాక్రమాలను చూసి గర్వపడుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. "ప్రధాని మోదీ నాయకత్వంలో, భారత బలగాలు సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద కార్యకలాపాలపై అత్యంత కచ్చితత్వంతో స్పందించాయి. ఉగ్రవాదం విషయంలో భారత్ ఎన్నటికీ మౌనంగా ఉండబోదని, దేశంపై, పౌరులపై, సైన్యంపై జరిగే దాడులను ఎంతమాత్రం సహించబోదని మోదీ నాయకత్వం నిరూపించింది. శాంతికి భంగం కలిగించే ఎలాంటి ముప్పునైనా దీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది" అని అంబానీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Admin
Studio18 News