Studio18 News - జాతీయం / : సరిహద్దు ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తున్న టర్కీ వైఖరిపై భారత ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పాకిస్థాన్ నుంచి ఉద్భవిస్తున్న ఉగ్రవాద సమస్యను పరిష్కరించేలా ఆ దేశానికి సూచించాలని టర్కీ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు గురువారం స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా ఉపయోగించకుండా పాకిస్థాన్‌ను నిరోధించాలని, దశాబ్దాలుగా ఇస్లామాబాద్, రావల్పిండి పెంచి పోషిస్తున్న ఉగ్రవాద వ్యవస్థలపై విశ్వసనీయమైన, ధృవీకరించదగిన చర్యలు తీసుకునేలా చూడాలని టర్కీకి భారత్ సూచించింది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం, టర్కీ పాకిస్థాన్ వైపు మొగ్గు చూపడంతో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. దేశాల మధ్య సంబంధాలు పరస్పర గౌరవం, ఒకరి ఆందోళనలను మరొకరు అర్థం చేసుకునే సున్నితత్వంపై ఆధారపడి ఉంటాయని భారత్ స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వారానికోసారి జరిగే మీడియా సమావేశంలో తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడితో ప్రారంభమైన భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ దుశ్చర్యలకు పాల్పడటంలో టర్కీ పాత్ర, భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' ప్రతిస్పందన సమయంలో వెలుగులోకి వచ్చింది. ఇస్లామాబాద్‌కు సైద్ధాంతిక, నైతిక మద్దతుతో పాటు, టర్కీ పాకిస్థాన్‌కు ఆయుధాలను కూడా సరఫరా చేసిందనే ఆరోపణలు వచ్చాయి. భారత్‌పై సైనిక దుశ్చర్యల సమయంలో పాకిస్థాన్ ఉపయోగించిన 300-400 డ్రోన్లను ఎక్కువగా టర్కీనే సరఫరా చేసిందని, ఈ డ్రోన్లు భారతదేశంలోని సైనిక, పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయని 'ఆపరేషన్ సిందూర్' ప్రెస్ బ్రీఫింగ్‌లో ప్రభుత్వం వెల్లడించింది. ఈ డ్రోన్లను లడఖ్‌లోని లేహ్ నుండి గుజరాత్‌లోని సర్ క్రీక్ వరకు మొత్తం పశ్చిమ సరిహద్దు వెంబడి 36 ప్రదేశాలలో అనేక చొరబాట్లు, భారత గగనతల ఉల్లంఘనలకు ఉపయోగించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇంతేకాకుండా, పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన కచ్చితమైన క్షిపణి దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినప్పుడు, టర్కీ పాకిస్థాన్‌కు సంఘీభావం ప్రకటించింది. అదే సమయంలో, ఐక్యరాజ్యసమితి నిషేధించిన లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'కు చెందిన పాకిస్థాన్ సంబంధిత ఉగ్రవాదులు జరిపిన పహల్గామ్ ఉగ్రదాడిని టర్కీ ఖండించలేదు. 'ఆపరేషన్ సిందూర్' సమయంలో టర్కీ తన యుద్ధనౌకను కరాచీ పోర్టుకు పంపి, దానిని "సాధారణ పోర్ట్ కాల్"గా పేర్కొంటూ సైనిక వైఖరిని ప్రదర్శించింది. భారత్‌పై పాకిస్థాన్ దుస్సాహసానికి సహాయం చేయడానికి టర్కీ ఆయుధాలు, ఆయుధ సంపత్తితో కూడిన సైనిక విమానాలను కూడా పంపిందని నివేదికలు రాగా, ఆ విమానాలు ఇంధనం నింపుకోవడానికి మాత్రమే ల్యాండ్ అయ్యాయని టర్కీ స్పష్టం చేసింది.
Admin
Studio18 News