Studio18 News - అంతర్జాతీయం / : అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని దుండగులు కాల్చి చంపారు. నార్త్‌వెస్ట్ డీసీలోని ఎఫ్‌బీఐ వాషింగ్టన్ ఫీల్డ్ ఆఫీస్‌కు సమీపంలో ఉన్న జ్యూయిష్ మ్యూజియం వద్ద ఈ కాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటనను అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ధృవీకరించారు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆమె తెలిపారు. "ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బందిని దారుణంగా హత్య చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం," అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, మరణించిన వారి వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కాల్పుల ఘటన గురించి సమాచారం అందిందని, బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నామని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ అన్నారు. మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (ఎంపీడీ)తో కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాల్పులు జరిగిన సమయంలో మ్యూజియంలో అమెరికన్ జ్యూయిష్ కమిటీ (ఏజేసీ) ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం జరుగుతోందని సమాచారం. ఈ దాడిని ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డనోన్ తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత హేయమైన యాంటీ-సెమిటిక్ ఉగ్రవాద చర్య అని ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. ఫెడరల్ స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరుగుతుందని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. వాషింగ్టన్ డీసీ పోలీసులు ఘటనా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, సాక్షులు, సీసీటీవీ ఫుటేజ్ కోసం గాలిస్తున్నారు.
Admin
Studio18 News