Studio18 News - జాతీయం / : మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి విజయ్ షా, సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని స్పష్టం చేసింది. పెరిగిన వ్యతిరేకత నేపథ్యంలో మంత్రి విజయ్ షా తన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలిపారు. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల సమయంలో మీడియాకు వివరాలు వెల్లడించిన సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీపై మంత్రి విజయ్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహాట్కర్ ఈ ఘటనపై స్పందిస్తూ, "కొందరు బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వ్యక్తులు స్త్రీల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఇది మన సమాజంలోని మహిళల గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, దేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న మన కుమార్తెలను అవమానించినట్లు అవుతుంది" అని పేర్కొన్నారు. మంత్రి పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు మహిళల పట్ల గౌరవప్రదమైన వైఖరిని అలవర్చుకోవాల్సిన ఆవశ్యకతను విజయ రహాట్కర్ నొక్కిచెప్పారు. "కల్నల్ సోఫియా ఖురేషీ దేశం గర్వించదగ్గ భారత పుత్రిక. దేశాన్ని ప్రేమించే ప్రతి భారతీయుడికి ఆమె సోదరి వంటివారు. ఆమె ఎంతో ధైర్యంతో, అంకితభావంతో దేశానికి సేవ చేస్తున్నారు. అటువంటి మహిళలను చూసి దేశం గర్వపడుతోంది. దేశం ప్రగతి పథంలో పయనించాలంటే మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు వచ్చి నాయకత్వం వహించాలి. మహిళలపై అగౌరవ వ్యాఖ్యలు చేయడం దేశాభివృద్ధిని అడ్డుకోవడమే" అని విజయ రహాట్కర్ సామాజిక మాద్యమం వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి విజయ్ షా ప్రసంగిస్తూ, "వాళ్లు (ఉగ్రవాదులు) మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేశారు. వాళ్ల (ఉగ్రవాదుల) మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో మోదీజీ పాక్‌కు పంపించి పాఠం నేర్పించారు" అంటూ కర్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. మంత్రి వ్యాఖ్యలు అత్యంత సిగ్గుచేటుగా, కించపరిచేవిగా ఉన్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా విమర్శించారు. మంత్రి విజయ్ షాను తక్షణమే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రిని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవడంతో మంత్రి విజయ్ షా వెనక్కి తగ్గారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ, "ఉగ్రవాదుల దుశ్చర్యలతో నా మనసు తీవ్రంగా కలత చెందింది. ఆ ఆవేదనలోనే అలాంటి వ్యాఖ్యలు చేశాను. కులమతాలకు అతీతంగా దేశానికి కల్నల్ ఖురేషీ అందిస్తున్న సేవలకు నేను సెల్యూట్ చేస్తున్నాను. ఆమెను కించపరిచే ఆలోచన నాకు కలలో కూడా రాదు. నా మాటలు ఎవరి మనసునైనా నొప్పించి ఉంటే, పదిసార్లు క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని తెలిపారు.
Admin
Studio18 News