Studio18 News - అంతర్జాతీయం / : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారపర్వం జోరుగా కొనసాగుతోంది. అధ్యక్ష అభ్యర్థులుగా ఖరారైన రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ కమలా హ్యారీస్ పరస్పరం విమర్శల దాడి చేసుకుంటున్నారు. తాజాగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమలా హ్యారీస్ నిజంగా నల్లజాతీయురాలా?.. లేక 2024 అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసం అలా చెప్పుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ‘‘కమలా హ్యారీస్ ఎప్పుడూ భారతీయ వారసత్వం కలిగిన వ్యక్తిగానే ఉండేవారు. భారతీయ వారసత్వాన్ని మాత్రమే ఆమె ప్రచారం చేసుకున్నారు. నల్లజాతిగా మారిన కొన్నేళ్ల కిందటి వరకు ఆమె నల్లజాతీయురాలని నాకు తెలియదు’’ అని ట్రంప్ అన్నారు. ఈ మేరకు షికాగోలో ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్’లోని జర్నలిస్టుల ప్యానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికైతే తనను నల్లజాతీయురాలిగానే పిలవాలని కమలా హ్యారీస్ కోరుకుంటున్నారని, కాబట్టి ఆమె భారతీయురాలా? లేక నల్లజాతీయురాలా? అనేది తనకు తెలియదని ట్రంప్ విమర్శించారు. అమెరికా చరిత్రలో మొట్టమొదటిసారి ఒక నల్లజాతి మహిళ, దక్షిణాసియా వారసత్వం కలిగిన వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారీస్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీపడడంపై ప్రశ్నించగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎవరో ఒకరిగా ఉంటేనే తాను గౌరవిస్తానని, కానీ ఆమె స్పష్టంగా అలా ఉండడం లేదని ట్రంప్ విమర్శించారు. కమలా హ్యారీస్ భారతీయురాలిగా ఉండేవారని, అకస్మాత్తుగా ఆమె నల్లజాతి వ్యక్తి అయిందని ఆరోపించారు. స్పందించిన వైట్‌హౌస్.. డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. కమలా హ్యారీస్‌పై వ్యక్తిగత దాడి చేశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వైట్‌హౌస్ కార్యాలయం తక్షణమే స్పందించింది. ట్రంప్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ మండిపడింది. ‘‘వాళ్లు అది.. వీళ్లు ఇది.. అని చెప్పే హక్కు ఎవరికీ లేదు’’ అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ వ్యాఖ్యానించారు.
Admin
Studio18 News