Studio18 News - జాతీయం / : ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ప్రకటించిన ఆకస్మిక కాల్పుల విరమణ ఒప్పందం, కశ్మీర్ సమస్య పరిష్కారానికి సాయం చేస్తానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు ప్రమాదకరమని ఆయన అభివర్ణించారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎందుకు ట్రంప్ జోక్యానికి అనుమతిస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నేడు మీడియా సమావేశంలో మాట్లాడిన గెహ్లాట్... భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో తాను కీలక పాత్ర పోషించానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరణ ఇవ్వాలని కోరారు. "ట్రంప్ చేసిన ట్వీట్ల గురించి ప్రధాని మోదీ మాట్లాడకపోవడంపై నాకు అభ్యంతరం ఉంది" అని గెహ్లాట్ అన్నారు. సిమ్లా ఒప్పందం ప్రకారం మూడో దేశం జోక్యం చేసుకోరాదని స్పష్టంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు ట్రంప్ రంగ ప్రవేశం చేశారని గెహ్లాట్ గుర్తుచేశారు. "భారత ప్రభుత్వ సమ్మతితోనే ట్రంప్ ఈ విషయంలోకి వచ్చారా లేదా అన్నది మాకు తెలియదు" అని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ విషయంలో ట్రంప్ జోక్యానికి అకస్మాత్తుగా ఎందుకు అనుమతించాల్సి వచ్చిందో, దాని వెనుక ఉన్న నిర్బంధమేమిటో ప్రభుత్వం వెల్లడించడం లేదని ఆయన విమర్శించారు. కశ్మీర్ సమస్యపై సాయం చేస్తానన్న ట్రంప్ ప్రతిపాదన అత్యంత ప్రమాదకరమైన పరిణామమని గెహ్లాట్ అభివర్ణించారు. ఆపరేషన్ సిందూర్‌ను రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం వాడుకుంటోందని పరోక్షంగా విమర్శించారు. సాయుధ దళాలు దశాబ్దాలుగా దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశాయని... కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1965, 1971 పాకిస్థాన్‌తో యుద్ధాలు జరిగిన వేళ కూడా సైన్యం విజయవంతమైందని గెహ్లాట్ గుర్తుచేశారు.
Admin
Studio18 News